ISRO: కక్ష్యలో కలుద్దాం!
ABN, Publish Date - Dec 31 , 2024 | 03:51 AM
భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఎంతో కీలకమైన ‘స్పేస్ డాకింగ్’ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది.
స్పేస్ డాకింగ్ మిషన్‌లో తొలి ఘట్టం విజయవంతం
ఈ విజయం దేశానికి నూతన సంవత్సర కానుక. జంట ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం ఈ మిషన్‌లో తొలి భాగం. డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుంది. జనవరి 7న జరిగే అవకాశం ఉంది. మన సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో ఇదో మైలురాయి.
- సోమనాథ్, చైర్మన్, ఇస్రో
రోదసిలోకి స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు.. సత్తా చాటిన ఇస్రో
15.13 నిమిషాల్లోనే కక్ష్యలోకి చేర్చిన పీఎ్‌సఎల్వీ-సీ60
డాకింగ్ పూర్తయితే అమెరికా, రష్యా, చైనా సరసన భారత్!
అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి.. ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ఈ మిషన్‌లో భాగంగా ఎస్‌డీఎక్స్01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విజయాశ్వం పీఎ్‌సఎల్వీ-సీ60.. వాటిని 476 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూ కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ కక్ష్యలో విడివిడిగా తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను కొద్దిరోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం (డాకింగ్) చేయనున్నారు. అది విజయవంతమైతే.. ఇప్పటికే డాకింగ్ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలుస్తుంది!
సూళ్లూరుపేట, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఎంతో కీలకమైన ‘స్పేస్ డాకింగ్’ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. స్పేస్ డాకింగ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనల కేంద్రం ఇస్రో చేపట్టిన జంట ఉపగ్రహాల ప్రయోగం (స్పేడెక్స్)లో తొలి అడుగు ఘనంగా పడింది. ఈ మిషన్‌లో భాగంగా చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను మోసుకెళ్లిన పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్.. వాటిని జాగ్రత్తగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9.58 గంటలకు నిర్వహించాల్సి ఉంది. కానీ.. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా రెండు నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 10:15 గంటలకు నింగిలోకి ఎగిరిన రాకెట్.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం తొలి ఉపగ్రహాన్ని 15.10 నిమిషాలకు, రెండో ఉపగ్రహాన్ని 15.13 నిమిషాలకు భూమికి 476 కిలోమీటర్ల ఎత్తున, వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా విడిచిపెట్టింది. దీంతో మిషన్ కంట్రోల్ సెంటర్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాకెట్ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పేడెక్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు. ఇక ఈ ప్రయోగంలో అసలు సిసలైన ఘట్టం.. డాకింగ్ (రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ) మిగిలి ఉంది. చందమామపైకి మన వ్యోమగాములను పంపి, అక్కడి మట్టి ఇక్కడికి తీసుకురావాలన్నా, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్నా.. ఇలా భవిష్యత్తులో చేపట్టబోయే పలు కీలక ప్రయోగాలకు అత్యంత కీలకమైనది డాకింగ్ పరిజ్ఞానం. ప్రస్తుతానికి అమెరికా, రష్యా, చైనా అంతరిక్ష పరిశోధనల సంస్థల వద్ద మాత్రమే ఈ పరిజ్ఞానం ఉంది.
అనేక ప్రయోగాలకు నాంది..
పీఎ్‌సఎల్వీ-సీ60 రాకెట్ మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాల్లో ఒకటి.. ఎస్‌డీఎక్స్01 (చేజర్) కాగా, మరొకటి ఎస్‌డీఎక్స్02 (టార్గెట్). ఒక్కో దాని బరువు సుమారు 220 కేజీలు. ఈ ఉపగ్రహాలతోపాటు.. పీఎ్‌సఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పోయెమ్) ద్వారా మరో 24 పేలోడ్లను కూడా ఇస్రో రోదసిలోకి పంపింది. ఆ పేలోడ్ల ద్వారా అనేక ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో ప్రణాళికలు రచించింది.
జనవరిలో మరిన్ని..
వచ్చే ఏడాది జనవరిలో షార్ నుంచి మరిన్ని ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. పీఎ్‌సఎల్వీ రాకెట్ నావిగేషన్ రెండో సిరీ్‌సలో ఎన్‌వీఎ్‌స-02 ఉపగ్రహాన్ని పంపనున్నామని వెల్లడించారు. జనవరి మూడో వారంలో జీఎ్‌సఎల్వీ-ఎఫ్15 ప్రయోగం ఉంటుందన్నారు. ఇది కాకుండా.. గగన్‌యాన్-జీ1 ద్వారా మావనరహిత ప్రయోగం ఉంటుందని చెప్పారు. 2025లో షార్ నుంచి మరిన్ని ప్రయోగాలు చేపడతామని తెలిపారు. పీఎ్‌సఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోమవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఆయన దర్శించుకొన్నారు. పూజలు చేశారు. అంతకుముందు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్రో అధికారులు పీఎ్‌సఎల్వీ-సీ60 నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భారత్‌కు ప్రయోజనం ఏమిటి..?
అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే లక్ష్యంతో భారత్ గగన్‌యాన్ ప్రాజెక్టు చేపట్టనుంది. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి వాటిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 2035 నాటికి సొంతంగా అతరిక్ష కేంద్రాన్ని నిర్మించే దిశగా ముందుకు సాగుతోంది. అయితే అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి అవసరమైన వాటిని ఒకేసారి రాకెట్‌లో తరలించడం కుదరదు. కాబట్టి వాటిని విడతలవారీగా కక్ష్యలోకి చేర్చి వాటిని డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎ్‌సఎస్) ఇలాగే ఏర్పాటుచేశారు. స్పేస్ స్టేషన్లకు వ్యోమగాములను, వస్తువులను తీసుకెళ్లే వ్యోమనౌకలను సైతం డాకింగ్ ద్వారానే అనుసంధానం చేస్తారు. అలాగే కక్ష్యలోని ఉపగ్రహాలకు మరమ్మతులు చేపట్టాలన్నా, ఇంధనం నింపాలన్నా, వాటిని ఆధునీకరించాలన్నా.. డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.
లక్ష్యం పూర్తికాగానే అన్‌డాకింగ్..
డాకింగ్‌కు సంబంధించిన ప్రయోగాలు పూర్తికాగానే ఈ రెండు ఉపగ్రహాలు విడిపోతాయి. దీన్నే అన్‌డాకింగ్ అంటారు. విడిపోయిన తర్వాత అవి సాధారణ ఉపగ్రహాల మాదిరిగానే పరిశోధనలు సాగిస్తాయి. ఎస్‌డీఎక్స్01లోని హై రిజల్యూషన్ కెమెరా భూ పరిశీలనలకు ఉపయోగపడుతుంది. ఎస్‌డీఎక్స్02లోని మినయేచర్ మల్టీ స్పెక్ట్రల్ పరికరం సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనంపై అధ్యయనం చేస్తుంది. రేడియేషన్ మానిటర్ పేలోడ్ అంతరిక్షంలో ఎదురయ్యే రేడియో ధార్మికతను కొలుస్తుంది. కాగా, ఈ ఉపగ్రహాల జీవితకాలం రెండేళ్లు.
ఏమిటీ స్పేస్ డాకింగ్?
ఇల్లు కట్టాలంటే ఇటుకా ఇటుకా పేర్చాల్సిందే! అదే అంతరిక్షంలో అలా ఒక నిర్మాణాన్ని చేపట్టాలంటే? వ్యోమనౌకలను ఒకదానికొకటి అనుసంధానం చేయడం ద్వారా అంతరిక్ష కేంద్రం వంటి నిర్మాణాలను రూపొందించవచ్చు. దీన్నే స్పేస్ డాకింగ్ అంటారు. గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు.. వాటి వేగాన్ని నియంత్రించుకుంటూ, సమాచారాన్ని పంచుకుంటూ, దగ్గరైన తర్వాత సున్నితంగా అనుసంధానం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ. పైగా ఉపగ్రహాల పరిమాణం చిన్నగా ఉండడం సవాలుగా మారనుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఉపగ్రహాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంది.
మస్క్ ఉపగ్రహాల వల్ల ఆలస్యం
ఇస్రో ఈ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9:58 గంటలకు చేపట్టాలని నిర్ణయించింది. కానీ.. స్పేస్ ఎక్స్ చీఫ్, అమెరికన్ కుబేరుడు ఈలన్ మస్క్‌కు చెందిన ‘స్టార్ లింక్’ ఉపగ్రహాలు కొన్ని అదే సమయానికి ఆ దారిలో వస్తాయని గుర్తించిన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని 2.15 నిమిషాలపాటు వాయిదా వేశారు. ‘‘అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాకెట్ వెళ్లాల్సిన కక్ష్యలో ఆ సమయానికి ఇతర ఉపగ్రహాల గమనం కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశాం. ప్రయోగాన్ని రాత్రి 9:58 గంటలకు బదులుగా 10 గంటలా 15 సెకన్లకు రీ షెడ్యూల్ చేశాం’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. కాగా..అంతరిక్షంలో ట్రాఫిక్ కారణంగా రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేయడం ఇదే తొలిసారి కాదు. 2023లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని కూడా ఇలాగే కొన్ని నిమిషాలపాటు వాయిదా వేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
Updated Date - Dec 31 , 2024 | 03:51 AM