Jharkhand:ఆ శాఖకు మంత్రి లేరు.. సోరెన్ ఎత్తుగడ అదేనా..
ABN, Publish Date - Dec 08 , 2024 | 09:29 AM
ముఖ్యమంత్రి మైయన్ సమ్మాన్ యోజన కాంగ్రెస్, జెఎంఎం కూటమి అధికారంలోకి రావడానికి కీలకంగా చెప్పుకుంటారు. అటువంటి సమయంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించకపోవడం జార్ఖండ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హేమంత్ సోరెన్ కొత్త కేబినెట్‌లోని ఏ ప్రత్యేక మంత్రికి మహిళా అభివృద్ధి శాఖ బాధ్యతను అప్పగించలేదు. సీఎం తన వద్దనే ప్రస్తుతానికి ఆశాఖను..
జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహిళా ఓటర్లు. మహిళల కోసం అమలు చేసిన ముఖ్యమంత్రి మైయన్ సమ్మాన్ యోజన కాంగ్రెస్, జెఎంఎం కూటమి అధికారంలోకి రావడానికి కీలకంగా చెప్పుకుంటారు. అటువంటి సమయంలో మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖకు ప్రత్యేక మంత్రిని నియమించక పోవడం జార్ఖండ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హేమంత్ సోరెన్ కొత్త కేబినెట్‌లోని ఏ ప్రత్యేక మంత్రికి మహిళా అభివృద్ధి శాఖ బాధ్యతను అప్పగించలేదు. సీఎం తన వద్దనే ప్రస్తుతానికి ఆశాఖను పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో జోబా మాంఝీ, ఆ తర్వాత బేబీ దేవి మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రులుగా చేశారు. ఈసారి ఈ శాఖను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వయంగా చూసుకుంటున్నారు.
24 ఏళ్లలో తోలిసారి..
24 ఏళ్ల జార్ఖండ్ చరిత్రలో మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ బాధ్యతలను ప్రత్యేకంగా ఏ మంత్రికి ఇవ్వకపోవడం ఇదే తొలిసారి. బాబు లాల్ మరాండీ తొలి ప్రభుత్వంలో జోబా మాంఝీకి మహిళా శిశు అభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు. మరాండి తర్వాత అర్జున్ ముండా జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అర్జున్ ముండా ప్రభుత్వంలో విమలా ప్రధాన్‌కి మహిళా అభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు. మధు కోడా ప్రభుత్వంలోనూ జోబా మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో రఘుబర్ దాస్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. దాస్ ప్రభుత్వంలో లూయిస్ మరాండీ మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించారు. మహిళలు, శిశువుల అభివృద్ధి కోసం పనిచేసే ఈశాఖ కింద జార్ఖండ్‌లో 30కి పైగా పథకాలు అమలుచేస్తున్నారు. వీటిలో ప్రముఖమైనది ముఖ్యమంత్రి మైయన్ సమ్మాన్ యోజన. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సోరెన్ ప్రభుత్వం ఏర్పడటంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలందరికీ సామాజిక భద్రత కింద నెలకు రూ వెయ్యి లబ్ధిదారులకు అందిస్తున్నారు.
మంత్రిని ఎందుకు నియమించలేదు..
హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలో మంత్రులకు శాఖల విభజన సందర్భంగా ఆర్థిక, హోం, రెవెన్యూ, రోడ్ల నిర్మాణం, ప్రొహిబిషన్, ఎడ్యుకేషన్ వంటి శాఖలను విభజించగా.. మహిళాభివృద్ధి శాఖను ఎవరికీ కేటాయించకపోవడంపై చర్చ జరుగుతోంది. ఈ శాఖను ఎవరికీ ఎందుకు అప్పగించలేదన్నదే ప్రశ్న తలెత్తుతోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి మైయన్ సమ్మాన్ యోజన పథకాన్నిజార్ఖండ్‌లో గేమ్ ఛేంజర్‌గా పిలుస్తారు. ఈ పథకం కారణంగా 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా జార్ఖండ్‌లో వరుసగా రెండోసారి ఒకే ప్రభుత్వం ఎన్నికైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హేమంత్ సోరెన్ మహిళలకు అందించే ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచుతున్నారు. ప్రకటించారు. డిసెంబర్ 11 నుంచి మహిళల ఖాతాల్లోకి నెలకు రూ.2500 జమ చేస్తామని ప్రకటించారు. ఇదొక్కటే కాదు సోరెన్ ప్రభుత్వం మహిళల కోసం మరిన్ని పథకాలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీంతో మహిళకోసం పథకాలు అందించడంతో పాటు మహిళా సాధికారతకు ప్రధాన్యత ఇచ్చే ఉద్దేశంతో పాటు.. పథకాల అమలు క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు ఆ శాఖను సీఎం సోరెన్ తన వద్ద పెట్టుకున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు కొన్ని నెలల తర్వాత మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో తన భార్య కల్పనా సోరెన్‌కు మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించే ఉద్దేశంతోనే మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖను సోరెన్ ఎవరికీ కేటాయించలేదనే చర్చ నడుస్తోంది. సోరెన్ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలియాలంటే మరికొన్ని నెలలు వేచిచూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 08 , 2024 | 09:29 AM