Justice Nariman: న్యాయాన్ని అవహేళన చేసిన రామజన్మభూమి తీర్పు
ABN, Publish Date - Dec 08 , 2024 | 04:43 AM
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘న్యాయానికి జరిగిన పెద్ద అవహేళన’లాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎ్‌ఫ.నారిమన్ అభిప్రాయపడ్డారు.
అయినా అందులోని 5 పేజీలు కీలకం
సుప్రీం మాజీ జడ్జి నారిమన్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబరు 7: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘న్యాయానికి జరిగిన పెద్ద అవహేళన’లాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎ్‌ఫ.నారిమన్ అభిప్రాయపడ్డారు. అది లౌకికవాదం అన్న సూత్రాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. అయితే ఈ తీర్పులోనూ కాంతిరేఖలాంటి ఓ మంచి అంశం ఉందని, అది ప్రార్థనా స్థలాల చట్టం-1991ని ఆమోదించడమని స్పష్టం చేశారు. జస్టిస్ ఎ.ఎం.అహ్మది స్మారక ప్రథమ ఉపన్యాసంలో ‘లౌకికవాదం-భారత రాజ్యాంగం’ అన్న అంశంపై ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వేయి తలల జలసర్పం (హైడ్రా) మాదిరిగా దేశమంతటా తలలు ఎగరవేస్తున్న ప్రార్థనా మందిరాల వివాదాలకు ముగింపు పలకాలంటే ప్రార్థనా స్థలాల చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయడమే మార్గమని చెప్పారు.
‘‘మసీదులపై, దర్గాలపై ఒక కేసు తరువాత మరో కేసు నమోదవుతునే ఉంది. ఇది మత విద్వేషాలకు దారి తీస్తుంది. దీన్ని అడ్డుకోవాలంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదు తీర్పులోని అయిదు పేజీలే కీలకం. అది ప్రార్థనా మందిరాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని ఆమోదించింది. దాన్ని ప్రతి జిల్లా కోర్టులోను, హైకోర్టులోనూ చదివి వినిపించాలి. ఎందుకంటే అవి సుప్రీంకోర్టు ఆదేశాలు. అందరూ కట్టుబడి ఉండాలి’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ఆరు ప్రయోజన వ్యాజ్యాలపై ఈ నెల 12న సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరపనుంది. 1947 ఆగస్టు 15 నాటికి ఉన్న ప్రార్థనా మందిరాల స్వరూపాన్ని మార్చకూడదని ఈ చట్టం చెబుతోంది.
Updated Date - Dec 08 , 2024 | 05:19 AM