Kamala Haasan: ఆ ఒక్కసీటు ఎవరిస్తారో..? అయోమయంలో కమలహాసన్
ABN, Publish Date - Mar 04 , 2024 | 12:13 PM
లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియక మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్(Kamala Haasan) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో తెలియక మక్కల్ నీదిమయ్యం నేత కమలహాసన్(Kamala Haasan) అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల డీఎంకే సీనియర్ నేతలు చేసిన ప్రకటనలు కూడా డీఎంకే కూటమిలో ఎంఎన్‌ఎం ఉందో లేదో తెలియని అనిశ్చిత పరిస్థితి కొనసాగుతున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి. తొలి నుంచి డీఎంకే కూటమిలో చేరితే కనీసం రెండు లోక్‌సభ నియోజకవర్గాలు కేటాయిస్తారని కమల్ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం డీఎంకే కూటమిలోని మిత్రపక్షాలకు మునుపటి లోక్‌సభ ఎన్నికల సమయంలో కేటాయించినట్లుగానే సీట్లు కేటాయిస్తున్నారు. వామపక్షాలకు ఇప్పటికే తలా రెండు సీట్లు కేటాయించారు. తమకు మూడు సీట్లు కేటాయించాలని, అదీ రెండు రిజర్వుడు, ఒక అన్ రిజర్వుడు నియోజకవర్గాన్ని కేటాయించాలని డీపీఐ అధినేత తిరుమావళవన్ పట్టుబడుతున్నారు. ఈ కారణంగానే శనివారం ఖరారు కావాల్సిన సీట్ల సర్దుబాట్లు వాయిదా పడ్డాయి. ఇక ఈ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ పది నియోజకవర్గాలు కావాలని పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్తగా కూటమిలో చేరిన ఎంఎన్‌ఎంకు సీటు కేటాయించడానికి డీఎంకే అదిష్ఠానం తటపటాయిస్తోంది. కాంగ్రెస్ కు 8 లేదా 9 సీట్లిచ్చి అందులో ఓ సీటును ఎంఎన్‌ఎంకు కేటాయించేలా డీఎంకే అధిష్ఠానం ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనను చూసి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విస్మయం చెందారు. ఈ విషయమై టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుందగై మాట్లాడుతూ... తమకు కేటాయించే నియోజకవర్గాల్లో ఒకదాన్ని ఎంఎన్‌ఎంకు కేటాయించమంటూ డీఎంకే అధిష్ఠానం ఎలాంటి ప్రతిపాదన రాలేదన్నారు. ఇక డీఎంకే సీనియర్ నేతలు ఎవరూ ఎంఎన్‌ఎంకు తమ కూటమిలో ఉందని స్పష్టం చేయలేకపోతున్నారు.
దీనిపై డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ... కమల్ నాయకత్వం వహిస్తున్న ఎంఎన్‌ఎంకు తమ కూటమిలో చేర్చుకోవడంపై పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇటీవల విదేశాల నుంచి తిరిగొచ్చిన కమల్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ... రెండు రోజుల్లో కూటమి గురించి శుభవార్త వింటారని ప్రకటించారు. వారం దాటినా డీఎంకేతో పొత్తు ఖరారైనట్లు ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఇప్పటివరకూ డీఎంకే మిత్రపక్షాలతో సీట్ల కేటాయింపుల చర్చలు జరిగాయి. కానీ ఎంఎన్‌ఎం ప్రతినిధులతో కానీ, లేక కమల్‌తోగానీ డీఎంకే ఎన్నికల కమిటీ సభ్యులు చర్చలు జరపలేదు. ఇదంతా ఎంఎన్‌ఎంకు తమ కూటమిలో ఇంకా చేరలేదనడానికి సంకేతాలని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఈరోడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి మక్కల్ నీదిమయ్యం మద్దతు ప్రకటించిందని, కమల్ ప్రచారం కూడా చేశారని, ఇప్పటివరకూ ఆయన కాంగ్రెస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, కనుక కాంగ్రె్‌సకు కేటాయించే సీట్లలో కమలహాసన్ ఎన్ని సీట్లు పొందినా తమకు అభ్యంతరం లేదని డీఎంకే సీనియర్ నేతలు చెబుతున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోనూ కమల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ పలుకుబడిని ఉపయోగించి కాంగ్రెస్ పొందే సీట్ల నుంచి ఒకటి రెండు సీట్లను కమల్ పొందే అవకాశం ఉందని ఎంఎన్‌ఎం నేతలు పేర్కొంటున్నారు. పది సీట్ల కోసం పట్టుబడుతున్న కాంగ్రెస్ తొమ్మిది సీట్లే ఇస్తామని డీఎంకే అధిష్ఠానం చెబుతుండటంతో ఆ సీట్లలో ఒకటి రెండు సీట్లను మక్కల్ నీదిమయ్యం కేటాయిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ మక్కల్ నీదిమయ్యం నేత కమల్ ప్రస్తుతం తమ పార్టీ డీఎంకే కూటమిలో ఉందో లేదో? లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు సీట్లను డీఎంకే కేటాయిస్తుందా లేక కాంగ్రెస్ కేటాయిస్తుందో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారనడం అతిశయోక్తి కాదు.
Updated Date - Mar 04 , 2024 | 12:13 PM