ఈ సమయంలో ప్రధానితో భేటీనా?
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:46 AM
కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకేపై కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం
బెంగళూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘ముడా’ ఇంటి స్థలాల వివాదంలో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయమై పార్టీ అధిష్ఠానానికి వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య, శివకుమార్ ఆగస్టు మూడోవారంలో ఢిల్లీ వెళ్లారు. అదే సందర్భంలో శివకుమార్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిపై వివాదం కొనసాగుతున్న సమయంలో ప్రధానమంత్రిని డీకే కలవడంపై కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రధానిని కలిసేందుకు సొంత పార్టీ ముఖ్యమంత్రులకే అవకాశం లభించడం కష్టంగా ఉందని, అటువంటిది వైరి పార్టీ నేత అయిన శివకుమార్ ఏ విధంగా అపాయింట్‌మెంట్ పొందారనే విషయంపై అధిష్ఠానం ఆరా తీసినట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు, సీఎం ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి ప్రధానిని కలవడం వెనుక ఉద్దేశమేమిటని ఆరా తీసినట్టు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సుర్జేవాలా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రిగా పలు అభివృద్ధి పనులపై ప్రధానిని కలిశానని, రాజకీయ ఉద్దేశం లేదని డీకే వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో శివకుమార్ కూడా అమెరికా చేరుకున్నారు. వారిద్దరూ అక్కడ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Updated Date - Sep 10 , 2024 | 03:46 AM