Karnataka: ముస్లింల ఓటు హక్కుపై వివాదం.. విశ్వ ఒక్కలిగ మహాసంస్థాన మఠం స్వామీజీపై కేసు
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:09 PM
రైతులు ఐక్యమత్యంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని చంద్రశేఖరనాథ స్వామీజీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలన్నారు. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమన్నారు.
బెంగళూరు: ముస్లింల ఓటింగ్ హక్కు రద్దు చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశ్వ ఒక్కలిగ మహాసంస్థానం మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామీజీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ కిసాన్ సంఘ్ గత మంగళవారం నిర్వహించిన కార్యాక్రమంలో ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చట్టం తీసుకురావాలని చంద్రశేఖరనాథ స్వామీజీ వ్యాఖ్యానించారు. కర్ణాటక వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటీసుపై బీకేఎస్ ఈ సమావేశం జరిగింది.
రైతులు ఐక్యమత్యంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని స్వామీజీ తన ప్రసంగంలో పిలుపునిచ్చారు. ముస్లింలకు ఓటు హక్కు నిరాకరించాలన్నారు. కనిపించిన భూములన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు లాక్కోవడం ధర్మ విరుద్ధమన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒ్కకరూ పోరాడాలని, ఇతరుల భూములను తమ భూములంటూ వక్ఫ్ బోర్డు ప్రకటించుకోవడం అన్యాయమని అన్నారు. రైతుల భూములు రైతులకే దక్కేలా ప్రతి ఒక్కరూ పోరాటం సాగించాలన్నారు.
క్షమాపణ చెప్పిన స్వామీజీ
ముస్లింల ఓటింగ్ హక్కులను రద్దు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చంద్రశేఖరనాథ స్వామీజీ గత బుధవారంనాడు క్షమాపణలు తెలిపారు. పొరపాటును నోరుజారినట్టు వివరణ ఇచ్చారు. ఇతరుల మాదిరిగానే ముస్లింలు కూడా ఈ దేశ పౌరులేనని, ఓటు వేసే హక్కు వారికి ఉందన్నారు. ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలంటూ స్వామీజీ చేసిన వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త ఒకరు చేసిన ఫిర్యాదుపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మత విశ్వాసాలను, నమ్మకాలను దెబ్బతీసే విధంగా చేసిన వ్యాఖ్యలకు గాను భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 కింద స్వామీజీపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై కమిటీ గడువు పొడిగింపు
మరోవైపు, కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ గడువును 2025 బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ పొడిగిస్తూ లోక్‌సభ గురువారంనాడు ఒక తీర్మానం ఆమోదించింది. ఆరు రాష్ట్రాల్లో వక్ఫ్ ప్రాపర్టీ యాజమాన్య హక్కులపై వివిదం ఉందని, ఆ కారణాల రీత్యా కమిటీ గడువును పొడిగించాలని బుధవారం జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయించినట్టు జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు.
Updated Date - Nov 29 , 2024 | 04:09 PM