BJP vs Congress: నిర్మలమ్మ ఆరోపణలు.. కౌంటర్లతో ఉక్కిరిబిక్కిరి చేసిన కాంగ్రెస్
ABN, First Publish Date - 2024-02-10T22:27:01+05:30
శనివారం రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగింది. శ్వేతపత్రం స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత యూపీఏ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా, కేసీ వేణుగోపాల్ అందుకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు.
శనివారం రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం కొనసాగింది. శ్వేతపత్రం స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత యూపీఏ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేయగా, కేసీ వేణుగోపాల్ అందుకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ‘శ్వేతపత్రం’ నాటకం ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, ఆర్థిక పరిస్థితి వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ శ్వేతపత్రాన్ని తెరమీదకు తీసుకొచ్చారని విమర్శించారు.
నిర్మలా సీతారామన్ ఆరోపణలు
శ్వేతపత్రం స్వల్పకాలిక చర్చలో భాగంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు కొన్ని తప్పిదాలకు పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల.. వాజ్‌పేయీ హయాంలో 4 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం, యూపీఏ హయాంలో గరిష్ఠ స్థాయికి చేరి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యానించారు. అయితే.. కుదేలైన ఆర్థిక వ్యవస్థను కేవలం పదేళ్ల కాలంలోనే తాము ఐదో స్థానానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని విస్మరిస్తే.. అదే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. త్వరలోనే మన భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని జోస్యం చెప్పారు.
యూపీఏ హమాంలోని పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాలను తెలియజేసేందుకే తాము శ్వేతపత్రాన్ని విడుదల చేశామని చెప్పారు. విజయాలను సర్వనాశనం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రావీణ్యం పొందిందని అన్నారు. ఈశాన్య ప్రాంతాలను సైతం కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని ఫైర్ అయ్యారు. తాము ఆర్థిక వ్యవస్థను ఒక స్థాయికి తీసుకొచ్చాం కాబట్టే ఈ శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 2017లో 17.3 శాతం ఉంటే.. 2023లో అది 13.4 శాతానికి తగ్గిందని ఆమె హైలైట్ చేశారు. ప్రధాని మోదీ పదే పదే చెప్తున్నట్టు.. ఆయన మూడో టర్మ్‌లో భారత్ కచ్ఛితంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆమె నొక్కి చెప్పారు.
కేసీ వేణుగోపాల్ కౌంటర్స్
బీజేపీ విడుదల చేసిన శ్వేతపత్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. దేశంలోని చీకటి సత్యాలను దాచిపెట్టేందుకు దీనిని విడుదల చేశారని మండిపడ్డారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యల, ఆర్థిక స్థితిగతులు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ శ్వేతపత్రం డ్రామా ఆడుతున్నారని తూర్పారపడ్డారు. మాజీ ప్రధానులు నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డును స్వాగతిస్తూనే.. ప్రభుత్వం ఈ అవార్డులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తప్పుపట్టారు. నోట్ల రద్దు, రూపాయి పతనం, నిరుద్యోగం, పేదరికం గురించి శ్వేతపత్రంలో ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు.
2 కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని 100 రోజుల్లో వెనక్కి తీసుకురావడం, రూ.15 లక్షల చొప్పున ప్రతిఒక్కరి ఖాతాల్లో వేస్తామన్న హామీలను నెరవేర్చిన తర్వాత కొత్త హామీల గురించి మాట్లాడాలని బీజేపీని ఇరుకున పెట్టేశారు. 2022లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. 2023 నాటికే ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని బీజేపీ చెప్పిందని.. కానీ ఆ మాట మీద నిలబడలేకపోయిందని తిట్టిపోశారు. యూపీఏ హయాంలో రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చామని చెప్పిన ఆయన.. ఈ పదేళ్లలో ఉపాధి హామీ తరహాలో మీరు తీసుకొచ్చిన ఒక్క పథకం పేరు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ పదేళ్ల కాలంలో సొంత డబ్బా కొట్టుకోవడం కోసం కేవలం ప్రచారం చేశారే తప్ప, ఇంకేం చేయలేదని ఎద్దేవా చేశారు.
మోదీ ప్రభుత్వంలో పేదలు మరింత పేదలుగానూ, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కేవలం కార్పొరేట్ ప్రపంచంపై మాత్రమే బీజేపీ ఆసక్తి చూపిస్తోందని అన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో వార్షిక సగటు తలసరి జిడిపి వృద్ధి 5.9 శాతం ఉంటే.. మోదీ హయాంలో అది 3.8 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. యూపీఏ హయాంలో నికర విదేశీ పెట్టుబడులు జీడీపీలో 1.2 శాతం ఉండగా.. ఇప్పుడు ఎన్డీఏ హయాంలో 0.8 శాతానికి పడిపోయిందన్నారు. ప్రైవేటు కార్పొరేట్లే కాదు, రైతులు కూడా మోదీ పాలనపై విశ్వాసం చూపలేదన్నారు. మోదీ హయాంలో ఆహారధాన్యాల ఉత్పత్తుల వృద్ధి 34 నుంచి 31 శాతానికి పడిపోయిందని వేణుగోపాల్ అన్నారు.
Updated Date - 2024-02-10T22:27:02+05:30 IST