Rahul Security: రాహుల్ భద్రతపై భయాందోళనలు... అమిత్‌షాకు ఖర్గే లేఖ
ABN, Publish Date - Jan 24 , 2024 | 04:44 PM
భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎదరవుతున్న భద్రతా లోపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఖర్గే కోరారు.
న్యూఢిల్లీ: 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatara) అసోం (Assam) పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఎదరవుతున్న భద్రతా లోపాలపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆందోళన వ్యక్తం చేశారు. యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah)ను ఖర్గే కోరారు. ఈ మేరకు అమిత్‌షాకు ఆయన ఒక లేఖ రాశారు. రాహుల్ యాత్ర సందర్భంగా అసోంలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు ఆయన భద్రతపై భయాలకు కారణమవుతున్నాయని, ముఖ్యంగా జనవరి 22న జరిగిన ఘటన భద్రతా పరమైన ఆందోళనలను మరింత పెంచుతోందని అన్నారు.
''జనవరి 22వ తేదీన నాగావ్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు రాహుల్ కాన్వాయ్‌ను అడ్డుకుని ఆయనకు అత్యంత సమీపంగా వచ్చారు. ఇది భద్రతా రాహిత్యానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితి'' అని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు. అసోం పోలీసులు మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోవడం, కొన్నిసార్లు బీజేపీ కార్యకర్తలు రాహుల్ కాన్వాయ్ దగ్గరవరకూ వెళ్లేందుకు మార్గం సుగమం చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని దాటి వెళ్లడం వల్ల ఆయనకు, ఆయన భద్రతా టీమ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. భద్రతా వైఫల్యాలకు సంబంధించి తగిన సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఎలాంటి అరెస్టులు జరగలేదని, పలు ఘటనల్లో కనీసం విచారణ కూడా జరగడం లేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేసారు. రిస్క్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో రాహుల్, ఆయన టీమ్‌పై ఎలాంటి భౌతిక దాడులు జరక్కుండా యాత్ర సజావుగా ముందుకు సాగేందుకు చొరవ తీసుకోవాలని అమిత్‌షాను ఆ లేఖలో ఆయన కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకునేలా అసోం సీఎంకు, డీజీపీకి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jan 24 , 2024 | 04:44 PM