Kolkata Trainee Doctor Case: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా
ABN, Publish Date - Aug 12 , 2024 | 03:05 PM
కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ప్రొ. సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు.
కోల్‌కతా, ఆగస్ట్ 12: కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఉద్యోగానికి ప్రొ. సందీప్ ఘోష్ సోమవారం రాజీనామా చేశారు.
విలేకర్లతో ప్రొ. సందీప్ ఘోష్ మాట్లాడుతూ..
అనంతరం ప్రొ. సందీప్ ఘోష్ విలేకర్లతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై విమర్శలు హోరు వెల్లువెత్తిందన్నారు. మృతురాలు తన కుమార్తెతో సమానమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునారావృతం కాకూడదని ఆకాంక్షించారు. అందుకే ఓ తండ్రిగా.. కాలేజీ ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశానని ప్రొ. సందీప్ ఘోష్ వివరించారు.
శుక్రవారం తెల్లవారుజామున..
శుక్రవారం తెల్లవారుజామున ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిని హత్య చేసి.. అనంతరం లైంగిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణంపై దేశ్యవ్యాప్తంగా వైద్య సిబ్బంది స్పందించారు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వారు పిలుపు నిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో దాదాపు 3 లక్షల మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు..
మరోవైపు ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత కౌస్తవ్ బాగ్చీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఫోర్డా ఇండియా అధ్యక్షుడు డాక్టర్ అవిరల్ మాథుర్ స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. ఈ ఘటనకు నిరసనగా వైద్యులు ఆందోళన చేపట్టడం వల్ల.. రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఆందోళన చేపట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఇది నిర్భయ- 2..
అలాగే కోల్‌కతాలో ట్రైయినీ వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనకు నిరసనగా ఢిల్లీలోని అల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్ (ఎయిమ్స్)లోని రెసిడెన్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన చేపట్టింది. ఇంకోవైపు ఈ ట్రైయినీ వైద్య విద్యార్థిపై దారుణం చోటు చేసుకున్న సమయంలో ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు జూనియర్ డాక్టర్లకు కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ ఘటనపై న్యూఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలోని వైద్యులు స్పందించారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఇది సామూహిక హత్యాచారమని వారు ఆరోపించారు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు నుంచి ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనను వారు నిర్భయ 2గా అభివర్ణించారు.
రాతపూర్వకంగా హామీ లభించే వరకు సమ్మె..
ఈ దారుణ ఘటన చోటు చేసుకున్న సమయంలో డ్యూటీలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఏం చేస్తున్నారనే ఈ ఆందోళనలో పాల్గొన్న వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్డా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సర్వేష్ పాండే సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చించామన్నారు. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని కోరామన్నారు. అలాగే ఈ కేసు సీబీఐకి అప్పగించాలని.. అదే విధంగా పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం జరగాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని కోరినట్లు వివరించారు. తమ డిమాండ్లకు రాత పూర్వకంగా హామీ లభించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 12 , 2024 | 03:34 PM