Kuwait Fire Accident : కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం
ABN, Publish Date - Jun 13 , 2024 | 05:11 AM
పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయకష్టం చేసి, ఆదమరిచి
50 మంది భారతీయుల దుర్మరణం
మరో 35 మందికి గాయాలు.. వారిలో ఏడుగురి పరిస్థితి విషమం
మృతులంతా మలయాళీ, తమిళులే.. అందరూ ఎన్‌బీటీసీ కార్మికులే
ఆరంతస్తుల భవనంలో తెల్లవారుజామున వ్యాపించిన మంటలు
గ్యాస్ లీకేజీతోనే అగ్నిప్రమాదం
నిద్రలోనే అనంత లోకాలకు 35 మంది
చికిత్స పొందుతూ 15 మంది మృతి
మునిసిపాలిటీ అధికారుల సస్పెన్షన్
ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
మృతుల కుటుంబాలకు 2 లక్షలు
కువైట్‌కు కేంద్ర మంత్రి కేవీ సింగ్
తెలుగు వారంతా క్షేమం
కువైట్ సిటీ/న్యూఢిల్లీ/తిరువనంతపురం, జూన్ 12: పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేందుకు రేయింబవళ్లు కష్టపడి పనిచేసే ఆ కార్మికుల ఊపిరి ఆగిపోయింది. కాయకష్టం చేసి, ఆదమరిచి సేదతీరుతున్న వారిలో 35 మంది భారీ అగ్నిప్రమాదంతో నిద్రలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. పొగతో ఉక్కిరిబిక్కిరై కొందరు.. పైఅంతస్తుల నుంచి కిందకు దూకి తప్పించుకునే ప్రయత్నంలో మరికొందరు.. ఇలా 50 మంది గాయాలపాలవ్వగా వారిలో 15 మంది ఆస్పత్రిలో కన్నుమూశారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కువైట్‌లోని మంగఫ్ మునిసిపాలిటీ పరిధిలోని ఎన్‌బీటీసీ గ్రూప్ భవనంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మలయాళీ అయిన కేజీ అబ్రహానికి చెందిన ఎన్‌బీటీసీ కంపెనీలో పనిచేసేవారంతా మలయాళీలు, తమిళులే..! వీరికి వసతి కల్పించేందుకు కువైట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో భవనాలను నిర్మించారు. మంగాఫ్ నగరంలోని ఆరంతస్తుల భవనంలో సుమారు 196 మంది మలయాళీలు, తమిళులు నివసిస్తున్నారు. కువైట్‌లోని భారతీయులు ఈ భవనాన్ని ‘మలయాళీ క్యాంపు’గా పిలుస్తారు. కువైట్ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ఎన్‌బీటీసీ కార్మికులు నివసించే భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వంటగదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో.. క్షణాల్లో మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఉదయం 6 గంటల వేళ మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటనాస్థలిలో 35 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పైఅంతస్తుల నుంచి కిందకు దూకి గాయాలైన వారు, దట్టమైన పొగతో శ్వాస ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారు.. ఇలా మొత్తం 50 మందిని అల్-అదాన్, అల్-ఫర్వానియా, అల్-అమీరి, అల్-ముబారక్, అల్-జాబెర్ ఆస్పత్రులకు తరలించినట్లు ఆయన వివరించారు. వీరిలో 15 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మిగతా 35 మంది క్షతగాత్రులకు అత్యవసర చికిత్సలు అందజేస్తున్నట్లు వివరించారు. బాధితుల్లో చాలా మంది దట్టమైన పొగను పీల్చడం వల్ల మరణించినట్లు వైద్య అధికారులు ప్రకటించారు. కువైట్‌లోని భారత రాయబారి ఆదర్శ్ స్వైకా సంఘటనాస్థలిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎంబసీ హెల్ప్‌లైన్ +965 65505246ను సంప్రదించవచ్చన్నారు.
మోదీ, జైశంకర్ దిగ్ర్భాంతి
కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయులు మృతిచెందడం పట్ల ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘పరిస్థితిని సమీక్షిస్తున్నాం. కువైట్‌లోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులు సంఘటనాస్థలికి చేరుకున్నారు’’ అని పోస్టు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భారీ ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతి వర్ధన్ సింగ్ హుటాహుటిన కువైట్‌కు బయలుదేరారు. మృతదేహాలను త్వరితగతిన భారత్ తరలించేందుకు ఆయన చొరవ తీసుకుంటారని తెలుస్తోంది.
తెలుగు వారంతా క్షేమమే
తమకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్నిప్రమాద మృతుల్లో తెలుగు వారెవరూ లేరని ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు, యునైటెడ్ తెలుగు ఫోరం కన్వీనర్ వెంకట్ కోడూరి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ‘‘ప్రమాదం జరగ్గానే మనవాళ్లు ఉన్నారా? అనే అంశంపై ఆరా తీశాం. ఎన్‌బీటీసీ భవనం చుట్టుపక్కల నివసించే తెలుగువారిని ఆరా తీస్తే.. మృతుల్లో మలయాళీలు, తమిళులే ఉన్నట్లు చెప్పారు. కువైట్ అధికారిక వర్గాలు విడుదల చేసిన పేర్లలో, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో తెలుగువారు ఎవరూ లేరని స్పష్టమవుతోంది’’ అని ఆయన వివరించారు. అయితే, బుధవారం కడపటి వార్తలందేసరికి మృతుల్లో 21 మంది పేర్లను ప్రకటించారు. వారిలో ఒకరు ఏపీకి చెందిన వారు కావొచ్చని అనుమానిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మలయాళీలు కావడంతో కేరళలో విషాఽధ ఛాయలు అలుముకున్నాయి. కాగా, కువైట్‌లోని మలయాళీ సంఘాలు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు ఈ కింది హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి.
Updated Date - Jun 13 , 2024 | 05:11 AM