Loksabha: 15 మంది సభ్యులతో18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి
ABN, Publish Date - Aug 01 , 2024 | 01:33 PM
లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఎన్నిక పూర్తి అయ్యింది. 15 మంది సభ్యులతో 18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఏర్పడింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఛైర్మన్‌గా ప్రజాపద్దుల కమిటి ఏర్పాటు జరిగింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఎన్నిక పూర్తి అయ్యింది. 15 మంది సభ్యులతో 18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఏర్పడింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఛైర్మన్‌గా ప్రజాపద్దుల కమిటి ఏర్పాటు జరిగింది. 15 మందిలో ముగ్గురు తెలుగువారికి అవకాశం కల్పించారు. కొత్త లోక్‌సభ కొలువుదీరిన తర్వాత... ఎన్నిక ద్వారా ప్రజాపద్దుల కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. కమిటీలో సభ్యత్వం కోసం 19 మంది లోక్‌సభ సభ్యులు పోటీ పడ్డారు. చివరి నిముషంలో నలుగురు సభ్యులు ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. 2025 ఏప్రిల్ 30తో సభ్యుల కాలపరిమితి ముగియనుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నిక జరగనుంది.
ఎన్నికైన సభ్యులు..
18వ లోక్‌సభ ప్రజాపద్దుల కమిటి ఛైర్మన్‌గా కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. సభ్యులుగా... టిఆర్ బాలు, నిషికాంత్ దూబే, జగదాంబికా పాల్, రవిశంకర్ ప్రసాద్, సిఎం రమేష్, త్రివేంద్ర సింగ్ రావత్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సౌగతరాయ్, అపరాజితా సారంగి, అమర్ సింగ్, తేజస్వీ సూర్య, అనురాగ్ ఠాకూర్, బాలశౌరి, కేసి వేణుగోపాల్, ధర్మేంద్ర యాదవ్‌ను ఎన్నుకోవడం జరిగింది.
ప్రజాపద్దుల కమిటి విధులేంటంటే..
రైల్వే, రక్షణ, పోస్టల్ శాఖలతో పాటు ఇతర ప్రధాన పౌర శాఖలకు సంబంధించిన వ్యయాలను కమిటీ పర్యవేక్షిస్తుంది. పార్లమెంటు ద్వారా వివిధ శాఖలకు మంజూరైన నిధులతో పాటు వాటి వినియోగం, ఖర్చులపై ప్రజా పద్దుల శాఖ ఆరా తీస్తుంది. అలాగే వివిధ శాఖల వ్యయాలపై కాగ్ ఏమైనా నివేదికలు ఇస్తే.. వాటిని కూడా పరిశీలిస్తుంది. ఆయా శాఖలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకుని ఖర్చు ఏ విధంగా పెడుతున్నారనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రజా పద్దుల కమిటి కేవలం పెట్టిన ఖర్చులపై మాత్రమే కాదు.. పెట్టబోతున్న ఖర్చులపై కూడా కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా.. నిధుల దుర్వినియోగాన్ని అదుపు చేయడం కమిటీ ప్రధాన ధ్యేయం. అలాగే ఆయా శాఖల ఖాతాల నిర్వహణలో అవలంబిస్తున్న సాంకేతిక విధానాలు.. ఖర్చుల పద్దులపై ఉన్న అభ్యంతరాలను ఎప్పటికప్పుడు సమీక్షించి వాటిని యథాతథంగా పార్లమెంటు ముందు ఉంచుతుంది.
Updated Date - Aug 01 , 2024 | 01:34 PM