Madras High Court: అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై ఓపీఎస్‌కు హైకోర్టులో చుక్కెదురు
ABN, Publish Date - Mar 18 , 2024 | 05:05 PM
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టులో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్‌హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది.
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత ఓ.పన్నీర్‌సెల్వం (O panneerselvam)కు మద్రాసు హైకోర్టు (Madras High court)లో సోమవారంనాడు చుక్కెదురైంది. అన్నాడీఎంకే అధికారిక లెటర్‌హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాను ఆయన వినియోగించుకోరాదని కోర్టు తీర్పునిచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.సతీష్‌కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
అన్నాడీఎంకే లెటర్‌హెడ్, గుర్తు, జెండా ఉపయోగించకుండా ఓపీఎస్‌ను నిలువరించాలని పళనిస్వామి గతంలో పిటిషన్ వేశారు. దీనిపై 2003 నవంబర్ 7న జస్టిస్ సతీష్ కుమార్ తాత్కాలిక ఆదేశాలిస్తూ, ఓపీఎస్ వీటిని ఉపయోగించుకోరాదన్నారు. ఓపీఎస్ తిరిగి మూడు అప్పీల్స్ చేయగా, న్యాయమూర్తులు ఆర్.మహదేవన్, మొహమ్మద్ షపీఖ్‌తో కూడిన ధర్మాసనం ఆ అప్పీల్స్‌ను తోసిపుచ్చింది. అయితే, ఈ ఉత్తర్వును వెకేట్ చేయాలని కోరుతూ అవసరమైన అప్లికేషన్లతో సింగిల్ జడ్జిని ఆయన ఆశ్రయించేందుకు ధర్మాసనం అనుమతించింది. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సతీష్‌కుమార్ తాజా ఆదేశాలు ఇచ్చారు. అన్నాడీఎంకే లెటర్‌హెడ్, రెండాకుల గుర్తు, పార్టీ జెండాకు దూరంగా ఉండాలంటూ తీర్పునిచ్చారు. పార్టీపై పట్టు కోసం పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తలెత్తిన విభేదాలతో 2022 జూలైలో జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం పన్నీర్ సెల్వంపై బహిష్కరణ వేటు వేసింది. ఆ తర్వాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి పళనిస్వామి ఎన్నికయ్యారు.
Updated Date - Mar 18 , 2024 | 05:05 PM