Mahua Moitra: 'ఫెమా' కేసులో 3 వారాల గడువు కోరిన మాజీ ఎంపీ, కుదరదన్న ఈడీ
ABN, Publish Date - Feb 19 , 2024 | 09:26 PM
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసులో సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సిన టీఎంసీ నేత, లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారని, అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని సమాచారం.
న్యూఢిల్లీ: ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ (FEMA) ఉల్లంఘన కేసులో సోమవారంనాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కావాల్సిన టీఎంసీ నేత, లోక్‌సభ మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) గైర్హాజరయ్యారు. విదేశీ పెట్టుబడులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లతో ఈడీ ప్రధాన కార్యాలయానికి ఫిబ్రవరి 19న హాజరుకావాలని ఈడీ ఇంతకుముందు ఆమెను కోరింది. అయితే, తనకు 3 వారాలు సమయం కావాలని ఈడీని ఒక లేఖలో ఆమె కోరారని, అంత గడువు ఇవ్వడానికి ఈడీ నిరాకరించిందని సమాచారం. వచ్చే వారంలో తమ ముందు హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఫెమా కేసులో ఈడీ విచారణ
ఫెమా కేసుకు సంబంధించిన ఈడీ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, మహువా మొయిత్రాకు చెందిన పలు విదేశీ బ్యాంకు అకౌంట్లను అధికారులు గుర్తించారు. విదేశాల్లో మహువా మొయిత్రా రూ.7 లక్షల రెంట్‌కు ఒక హోటల్ గది బుక్ చేసుకున్నట్టు ఈడీ చెబుతోంది. అంత ఎక్కువ రెంట్‌కు రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నారనే దాని గురించి, ఎన్ఆర్ఏఐ అకౌంట్ గురించి సరైన సమాచారం ఆమె ఇవ్వలేదని ఈడీ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని తరఫున లోక్‌సభలో మహువా మొయిత్రా ప్రశ్నలు అడిగేవారని, అందుకు ప్రతిగా గిఫ్ట్‌లు తీసుకున్నారనే కారణంగా గత ఏడాది డిసెంబర్‌లో మొయిత్రా లోక్‌సభా సభ్వత్వాన్ని కోల్పోయారు. అయితే తాను ఎలాంటి తప్పూ చేయలేదని, అదానీ గ్రూప్ వివరాలను తాను సభలో ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని ఆమె చెబుతున్నారు.
Updated Date - Feb 19 , 2024 | 09:29 PM