PM Modi: ఇంకెన్నాళ్లు అదే పాట.. ప్రధాని మోదీకి స్ట్రాంగ్ కౌంటర్
ABN, Publish Date - Jun 24 , 2024 | 05:59 PM
ఎమర్జెన్సీపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట..
ఎమర్జెన్సీపై (Emergency) పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట పాడుతారంటూ చురకలంటించారు. ఇప్పటికే ఆయన ఈ మాట వందసార్లు చెప్పి ఉంటారని.. ఇంకెన్నాళ్లు అలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ అధికారంలో కొనసాగుతారని మండిపడ్డారు. నీట్ (NEET) ఆందోళనలపై గానీ, వెస్ట్ బెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై గానీ, మణిపూర్ అల్లర్లపై గానీ మోదీ స్పందిస్తారని చూస్తుంటే.. ఆ విషయాలపై ఆయన మౌనం పాటిస్తూ వస్తున్నారని దుయ్యబట్టారు.
సోమవారం మీడియాతో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోదీ నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారు. ఇప్పటికే మోదీ ఆ మాట వందసార్లు చెప్పి ఉంటారు. ఇందిరాగాంధీ (Indira gandhi) హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన తరువాత.. ప్రభుత్వం దానిని అమలు చేయడం జరిగింది. కానీ.. బీజేపీ పాలనలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దానిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ.. ఆయన ఎంతకాలం అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తారు?’’ అని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని, అందుకే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్టీలన్నీ ఏకమయ్యాయని అన్నారు.
ఇంతకీ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలేంటి?
సోమవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడి రేపటితో 50 ఏళ్లు పూర్తవుతాయి. ప్రజాస్వామ్య చరిత్రలో అదొక మచ్చలా మిగిలిపోయింది. 50 ఏళ్ల క్రితం జరిగిన ఆ పొరపాటు మళ్లీ పునరావృతం కాకూడదు’’ అని అన్నారు. ఇందుకు కౌంటర్‌గానే ఖర్గే పైవిధంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలని మోదీ కోరారు. ఈ దేశానికి బాధ్యతాయుతమైన విపక్షం అవసరమని, ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా ఆయన చెప్పుకొచ్చారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 24 , 2024 | 06:01 PM