Mamata Banerjee: మోదీ పర్యటనలో ఉండగానే అంగన్‌వాడీ వర్కర్లకు దీదీ వరాలు
ABN, Publish Date - Mar 06 , 2024 | 03:43 PM
లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీలు, వారి అసిస్టెంట్ల జీతాలు పెంచుతున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే మమతాబెనర్జీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకున్నారు. అంగన్‌వాడీ వర్కర్లు (Anganwadi workers), వారి అసిస్టెంట్ల జీతాలు పెంచుతున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. ఏప్రిల్ నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే అంగన్‌వాడ వర్కర్ల జీతాలు పెంచుతూ మమతాబెనర్జీ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంగన్‌వాడీ వర్కర్ల నెలసరి వేతనాన్ని రూ.8,250 నుంచి రూ.9,000కు మమతా సర్కార్ పెంచింది. పెంచిన రూ.750 వచ్చే నెల జీతంలో కలుస్తుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డవలప్‌మెంట్ స్కీమ్ (ఐసీడీఎస్) వర్కర్ల వేతనాలను కూడా రూ.500 పెంచుతున్నట్టు సీఎం ప్రకటించారు. ''ఆశా వర్కర్లు ఎంతో కష్టపడుతుంటారు. వారి వేతనాలు పెంచడం గర్వకారణంగా భావిస్తున్నాం. సంక్లిష్ట సమయాల్లోనూ ఆశా వర్కర్లు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి వారి వేతనాలను మరో రూ.750 పెంచుతుండటం సంతోషంగా ఉంది. ఐసీడీఎస్ హెల్పర్లు రూ.6,000 వేతనం పొందుతారు. ఏప్రిల్ 1 నుంచి వారికి రూ.500 వేతనం పెంచుతున్నాం. మా ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు బాసటగా నిలుస్తుంది'' అని సీఎం తెలిపారు. ఇటీవల ఒడిశా ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్ల వేతనాన్ని రూ.7,500 నుంచి రూ.10,000కు, మినీ అంగన్‌వాడీ వర్కర్ల వేతనాన్ని రూ.5,375 నుంచి రూ.7,250కి పెంచింది. కేరళ ప్రభుత్వం సైతం గత జనవరిలో 60,000 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.1,000 చొప్పున వేతనాన్ని పెంచింది.
Updated Date - Mar 06 , 2024 | 03:43 PM