యడియూరప్ప భార్య మృతి వెనుక శోభా కరంద్లాజె?
ABN, Publish Date - Oct 22 , 2024 | 05:22 AM
కర్ణాకట మాజీ సీఎం యడియూరప్ప భార్య మృతి వెనుక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె హస్తం ఉందని మంత్రి బైరతి సురేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
మంత్రి బైరతి సురేశ్ ఆరోపణలు
బెంగళూరు, అక్టోబరు21(ఆంధ్రజ్యోతి): కర్ణాకట మాజీ సీఎం యడియూరప్ప భార్య మృతి వెనుక కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె హస్తం ఉందని మంత్రి బైరతి సురేశ్ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా, సీఎం సిద్దరామయ్య కుమారుడు రాకేశ్ మృతి వెనుక మంత్రి బైరతి హస్తం ఉందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె అన్నారు. ముడా ఇంటి స్థలాల వివాదంలో సీఎం సిద్దరామయ్య హస్తముందని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె శనివారం డిమాండ్ చేశారు. మంత్రి బైరతి సురేశ్‌ను అరెస్టు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. కాగా, శోభ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బైరతి తీవ్రంగా స్పందించారు. శోభ ఆరోపణలు చేసినంత మాత్రాన వాస్తవం కాదని అన్నారు. మాజీ సీఎం యడియూరప్ప భార్య మైత్రాదేవి మృతి వెనుక కేంద్రమంత్రి శోభ ప్రమేయం ఉందని ఆరోపించారు. యడియూరప్ప మంచివారేనని, అయితే మైత్రాదేవి మృతిపై హోం మంత్రి జోక్యం చేసుకుని.. పోలీసులు కేసు నమోదు చేయించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి బైరతిపై కేంద్రమంత్రి శోభ మరోసారి విరుచుకుపడ్డారు. సీఎం సిద్దరామయ్య కుమారుడు రాకేశ్ విదేశాలలో మృతి చెందడానికి మంత్రి బైరతి సురేశ్ కారణమని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, తాను ఆ వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 05:22 AM