Minister Tummala: మంత్రి తుమ్మలను కలిసిన తమిళనాడు రైతు
ABN, Publish Date - Jan 05 , 2024 | 09:42 AM
నూనె ఉత్పత్తులతో సేంద్రియ ఎరువులను తయారుచేసి.. అధిక దిగుబడులు సాధిస్తున్న తమిళనాడు రైతు కుప్పుస్వామి గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకాలగూడెంలో రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao)ను కలిశారు.
- తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానం
ఖమ్మం/సత్తుపల్లి(ఖమ్మం), (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నూనె ఉత్పత్తులతో సేంద్రియ ఎరువులను తయారుచేసి.. అధిక దిగుబడులు సాధిస్తున్న తమిళనాడు రైతు కుప్పుస్వామి గురువారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకాలగూడెంలో రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao)ను కలిశారు. తమిళనాడులో తాను సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న పంటలను పరిశీలించేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుప్పుస్వామి మాట్లాడుతూ తెలంగాణలో ఒక ఆదర్శ రైతు వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారన్న విషయం తెలుసుకుని తాను రాష్ట్ర ఉద్యానశాఖ మాజీ కమిషనర్ వెంకటరామిరెడ్డి సాయంతో ఇక్కడకు వచ్చానని, అది కూడా ఆయన తన వ్యవసాయక్షేత్రంలో ఉండగా కలవడం సంతోషంగా ఉందన్నారు. తాను సంగారెడ్డిలో 25 ఎకరాల వ్యవసాయక్షేత్రాన్ని కౌలుకు తీసుకుని మొదట్లో రసాయనిక ఎరువులు వాడి నష్టపోయానని, తర్వాత నూనెగింజలను గానుగ ఆడించడం ద్వారా వచ్చిన నూనెలతో పాటు ఆయిల్ తీసిన తర్వాత వచ్చే పిప్పిని కలిపి సేంద్రియ ఎరువులను తయారు చేశానని, తద్వారా అధిక దిగబుడులు సాధించానని వివరించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని, తాను ఉద్యానపంటలతోపాటు పలు పంటలను సాగుచేస్తున్నానని కుప్పుస్వామి తుమ్మలకు వివరించారు. తమిళనాడు వచ్చి తాను చేస్తున్న సేంద్రియ పంటల సాగును, నూనె, వాటి ఉప ఉత్పత్తులతో సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించాలని తుమ్మలను కోరారు. ఈ క్రమంలో సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు సాధిస్తున్న కుప్పుస్వామిని మంత్రి తుమ్మల అభినందించారు.
Updated Date - Jan 05 , 2024 | 09:42 AM