ప్రజలు తిరస్కరించిన గుప్పెడుమంది అరాచకం
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:29 AM
ప్రజలు 80-90 సార్లు తిరస్కరించిన గుప్పెడుమంది వ్యక్తులు పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ రాజకీయ లబ్ధి కోసం అరాచకానికిపాల్పడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు.
పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే వారి లక్ష్యం ప్రజలు చూస్తున్నారు.. తప్పక శిక్షిస్తారు: మోదీ
న్యూఢిల్లీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజలు 80-90 సార్లు తిరస్కరించిన గుప్పెడుమంది వ్యక్తులు పార్లమెంటును నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ రాజకీయ లబ్ధి కోసం అరాచకానికిపాల్పడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం ఉదయం పార్లమెంటు కార్యకలాపాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు పురోగతిలో భాగస్వాములవడం కన్నా, దాని కార్యకలాపాలను అడ్డుకోవడమే ప్రతిపక్ష పార్టీల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ‘మన రాజ్యాంగ 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. రేపు సంవిధాన్ సదన్‌లో ప్రతి ఒక్కరం రాజ్యాంగ 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాం. మన పార్లమెంటు, మన ఎంపీలు కూడా ఇందులో ముఖ్యమైన భాగమే. పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చలు ఉండాలి. ఈ చర్చల్లో మరింతమంది భాగస్వాములవ్వాలి. దురదృష్టవశాత్తూ ప్రజల తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు తమ రాజకీయ లబ్ధి కోసం అరాచకానికి పాల్పడటం ద్వారా పార్లమెంటును నియంత్రించేందుకు నిరంతరంగా ప్రయత్నిస్తున్నారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తప్పక శిక్షిస్తారు’ అన్నారు. పార్లమెంట్ వ్యవస్థపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, దానికి అనుగుణంగా నడుచుకోవాలని ప్రతిపక్షాలకు మోదీ సూచించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా సభలో అంశాలను లేవనెత్తాలన్నారు.