Rahul Gandhi : చావు దెబ్బ తీశాం
ABN, Publish Date - Jun 13 , 2024 | 04:39 AM
ఎన్నికల్లో విపక్షాలు కొట్టిన చావుదెబ్బకు మోదీ సర్కారు కనీసం నడవలేని స్థితికి చేరుకుందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశాన్ని నడిపించే
మోదీ సర్కారుది కనీసం నడవలేని స్థితి
వయనాడ్, రాయ్‌బరేలీల్లో దేన్ని త్యజించాలో తేల్చుకోలేకపోతున్నా: రాహుల్
వయనాడ్, జూన్ 12: ఎన్నికల్లో విపక్షాలు కొట్టిన చావుదెబ్బకు మోదీ సర్కారు కనీసం నడవలేని స్థితికి చేరుకుందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశాన్ని నడిపించే చేవ ఎన్డీయే కూటమికి లేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ తమ వైఖరులను మార్చుకోవాల్సిందేనన్న స్పష్టమైన సంకేతాన్ని తమ తీర్పుతో దేశ ప్రజలు ఇచ్చారని పేర్కొన్నారు. కేరళలోని వయనాడ్‌లో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత వయనాడ్‌లో తొలిసారి ఆయన పర్యటించారు. ‘‘ఇప్పుడు చూసేది పాత మోదీని కాదు. మోదీ వేసుకున్న పథకాలను ఇండియా కూటమి ధ్వంసం చేసేసింది’’ అని రాహుల్ పేర్కొన్నారు. వారాణసీలో మోదీ త్రుటిలో ఓటమిని తప్పించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏడో విడత ఎన్నికల ప్రచార విరామంలో అందరూ ఇంటికి పరిమితం అయ్యారు. కానీ, మోదీ ధ్యానం పేరిట కన్యాకుమారిలో ప్రచారం సాగించారు. ఇంత చేసినా గానీ వారాణసీలో మోదీ మెజారిటీ గణనీయంగా తగ్గిపోయింది’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ అవసరాలను తీర్చేలా షెడ్యూల్‌ను ఈసీ తయారుచేసిందని, వారాణసీకి చివరి విడతలో ఎన్నికలు జరిపించడం ఇందులో భాగమేనన్నారు. కాగా, సాధారణ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీ నుంచి కూడా విజయం సాధించారు. ఈ రెండింటిలో ఒకటి ఆయన వదులుకోవాల్సి ఉంది. దీనిపై రాహుల్ స్పందిస్తూ.. ‘ఇంకా సందిగ్ధంలోనే ఉన్నాను. కానీ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి’ అని కోరారు. కాగా, ‘‘దేశానికి నాయకత్వం వహించాల్సిన నేతను వయనాడ్‌కే పరిమితం చేసి చూడలేం’’ అంటూ కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ అధ్యక్షుడు సుధాకరన్ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంమైంది.
అయోధ్య ప్రజలది గొప్ప తీర్పు
పుణే, జూన్ 12: మందిర రాజకీయాలను ఎలా తిప్పికొట్టాలో అయోధ్య ప్రజలు రుజువు చేశారని, అందుకే అక్కడ బీజేపీ ఓటమి చవిచూసిందని ఎన్‌సీపీ(ఎ్‌సపీ) నేత శరద్‌పవార్ పేర్కొన్నారు. రామ మందిరమే ప్రధాన ఎజెండాగా ఎన్నికల్లోకి వెళ్లిన అధికార పార్టీ భారీగా ఓట్లు మూటకట్టుకుంటుందని తాను భావించానని, కానీ దేశ ప్రజలు వివేకవంతులని, గుడి పేరుతో ఓట్లు అడుగుతుందని గ్రహించి బీజేపీని ఓడించారని తెలిపారు. మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మోదీపై విమర్శలు గుప్పించారు.
Updated Date - Jun 13 , 2024 | 04:39 AM