Vande Bharat Train: ఎంపీ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై దాడి
ABN, Publish Date - Nov 03 , 2024 | 05:20 PM
వందే భారత్ రైలులో ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తుండగా ఉదయం 7.12 గంటలకు రైలు బులంద్‌షహర్ జిల్లాలోని కమల్‌పూర్ స్టేషన్‌ను దాటగానే, బయటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసిరారని, దీంతో తన ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికుడి పక్కన కిటికీ అద్దాలు పగిలిపోయాయని..
రైల్వే ట్రాకులపై పేలుడు పదార్థాలు అమర్చడం, వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడి వంటి ఘటనలను ఇటీవల కాలంలో అధికంగా చూస్తున్నాం. ఆకతాయిలు అప్పుడప్పుడు వెళ్తున్న రైలుపై రాళ్లు విసరడం చూస్తాం. కానీ అదే పనిగా వందే భారత్ రైళ్లపై తరచూ రాళ్లు విసురుతున్న ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. రైల్వే శాఖ భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పడటంలేదు. ఒక్కోసారి రైలు అద్దాలు పగలడంతో పాటు ప్రయాణీకులకు స్వల్ప గాయాలవుతున్నాయి. కొంతమంది ఓ కుట్రగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారనే అనుమానాలను రైల్వే శాఖ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు, నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని సామాజిక మాద్యమాల్లో స్వయంగా ఎంపీ పంచుకున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగిందో వివరించారు. తాను వందే భారత్ రైలులో ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తుండగా ఉదయం 7.12 గంటలకు రైలు బులంద్‌షహర్ జిల్లాలోని కమల్‌పూర్ స్టేషన్‌ను దాటగానే, బయటి నుండి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు విసిరారని, దీంతో తన ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికుడి పక్కన కిటికీ అద్దాలు పగిలిపోయాయని సోషల్ మీడియా పోస్టులో ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పింఛన్ పెంచుతాం
పోస్టులో ఏం రాశారంటే..
వందే భారత్ రైలు కిటికీ అద్దం పగిలిన ఫోటోను చంద్రశేఖర్ ఆజాద్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సంఘటనతో తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడమే కాకుండా, ప్రయాణికుల భద్రతకు సంబంధించినదని ఎంపీ పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేమని, ప్రతి ఒక్కరూ ఈ ఘటనలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఇటీవల కాలంలో రైళ్లపై రాళ్ల దాడికి సంబంధించిన గణంకాలను ఆయన ఎక్స్‌లో పంచుకున్నారు. 2022లో దాదాపు 1500కు పైగా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. దీంతో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇలాంటి సంఘటనలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలన్నారు. రైళ్లపై రాళ్లు రువ్వడం వల్ల ఆస్తి నష్టం జరగడమే కాకుండా ప్రయాణికులకు ప్రాణాపాయం జరుగుతుందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి
రైల్వే మంత్రికి విజ్ఞప్తి
పండుగ సీజన్‌లో రైల్వే ప్రయాణీకుల సంఖ్య పెరిగిందని, ప్రస్తుతం రైళ్లలో రద్దీ కనిపిస్తుందన్నారు. రైల్వేలు దేశానికి అమూల్యమైన ఆస్తి అని, దాని పరిరక్షణ బాధ్యత దేశ పౌరులందరిదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ అన్నారు. ఆయన తన పోస్ట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ ఇలాంటి సంఘటనలను అరికట్టడానికి, కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను చంద్రశేఖర్ ఆజాద్ కోరారు. మనమంతా చైతన్యవంతమైన పౌరులుగా మారాలని అన్నారు. ఈ దేశం మనది, దేశ ఆస్తుల భద్రత ప్రభుత్వానిదే కాదు మనందరి నైతిక బాధ్యత అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Nov 03 , 2024 | 05:20 PM