ఎంపీ పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

ABN, Publish Date - Oct 29 , 2024 | 03:17 AM

బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు ఒకడు బెదిరించాడు.

ఎంపీ పప్పూ యాదవ్‌కు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

  • సల్మాన్‌ఖాన్‌కు మద్దతిచ్చినందుకు బెదిరింపు

న్యూఢిల్లీ, అక్టోబరు 28: బిహార్‌లోని పూర్ణియాకు చెందిన ఇండిపెండెంట్‌ ఎంపీ పప్పూ యాదవ్‌ను గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా సభ్యుడు ఒకడు బెదిరించాడు. హీరో సల్మాన్‌ఖాన్‌కు మద్దతుగా మాట్లాడినందుకు చంపేస్తామని హెచ్చరిస్తూ ఫోన్‌ చేశాడు. ఈ విషయాల్లో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించాడు. దాంతో పప్పూ యాదవ్‌ బిహార్‌ డీజీపీకి ఫిర్యాదు చేశారు. సల్మాన్‌ఖాన్‌ మిత్రుడైన ఎన్‌సీపీ నాయకుడు సిద్ఖిఖీని బిష్ణోయ్‌ అనుచరులు కాల్చి చంపారు. దీనిపై పప్పూ యాదవ్‌ ట్వీట్‌ చేస్తూ సల్మాన్‌ తరఫున తాను ఉన్నానని చెప్పారు. లారెన్స్‌ను పైసాకు పనికిరాని గ్యాంగ్‌స్టర్‌ అని విమర్శిస్తూ తనకు అవకాశం ఇస్తే 24 గంటల్లో ఆ ముఠాను రూపుమాపుతానంటూ బహిరంగంగా సవాలు విసిరారు. దీనిపై బిష్ణోయ్‌ ముఠా స్పందించింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ అక్కడి నుంచే వ్యవహారాలు నడుపుతున్నట్టు చెప్పాడు. ఆయనపై అన్న మాటలను వెనక్కి తీసుకోవాలని, ఇందుకు అవసరమైతే ‘భాయ్‌’తో మాట్లాడే అవకాశం కల్పిస్తానని పప్పూ యాదవ్‌కు చెప్పాడు. ‘‘మీరు ‘భాయ్‌’కు ఓ మాట చెప్పండి.

‘నేనేమీ అనలేదు...అంతా మీడియా సృష్టే’ అని చెప్పండి. సాధ్యమైనంత త్వరగా సెటిల్‌ చేసుకోండి. ‘భాయ్‌’తో మాట్లాడిస్తా’’ అని చెప్పాడు. అనంతరం పప్పూ యాదవ్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బెదిరింపు ఫోన్‌ కాల్‌పై ప్రశ్నించినప్పుడు ‘సంబంధం లేని ప్రశ్నలు అడగొద్దని ముందే చెప్పాను కదా’ అంటూ మీడియాపై చిరాకు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Oct 29 , 2024 | 03:17 AM