NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో సంచలనం.. ప్రశ్నాపత్రంతోపాటు సమాధానాలు సైతం..
ABN, Publish Date - Jun 20 , 2024 | 10:41 AM
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ(NEET Paper Leak) వివాదం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బిహార్ రాష్ట్రం సమస్తిపూర్‌కి చెందిన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ(NEET Paper Leak) వివాదం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బిహార్ రాష్ట్రం సమస్తిపూర్‌కి చెందిన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనురాగ్ యాదవ్.. తనకు అందించిన ప్రశ్నపత్రం అసలు పరీక్ష ప్రశ్నపత్రంతో సరిపోలిందని అంగీకరించాడు.
అనురాగ్ మేనమామ బిహార్‌లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ (దానాపూర్ నగర్ పరిషత్)లో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అతను మే 4న తనకు పేపర్ ఇచ్చాడని దీంతో రాత్రికి రాత్రే పూర్తిగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని అనురాగ్ తన నేరాంగీకర పత్రంలో పేర్కొన్నాడు. పరీక్ష హాళ్లో ఇచ్చిన ప్రశ్నాపత్రం తనకు ఇచ్చిన ప్రశ్నాపత్రంతో సరిపోలిందని అనురాగ్ చెప్పాడు. ప్రశ్నాపత్రంతోపాటు సమాధానాలు సైతం ఇచ్చాడని అనురాగ్ తెలిపాడు.
నివేదిక కోరిన విద్యా మంత్రిత్వ శాఖ..
ఇదిలా ఉండగా బిహార్ రాజధాని పట్నాలో నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం బీహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం నుంచి నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్, ఇతరత్రా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై పలు నగరాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
"పట్నాలో పరీక్ష నిర్వహణలో అవకతవకలకు సంబంధించి ఆర్థిక నేరాల విభాగం బిహార్ పోలీసుల నుంచి నివేదిక కోరింది. ఈ నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. పరీక్షల పవిత్రతను కాపాడటానికి, విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. లీక్‌లో ప్రమేయం ఉన్న ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా కఠిన చర్యలు తీసుకుంటాం" అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
నీట్ యూజీ పరీక్ష మే 5న 4,750 కేంద్రాల్లో నిర్వహించగా, దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను జూన్ 14న ప్రకటించాలని భావించినప్పటికీ, సమాధాన పత్రాల మూల్యాంకనం ముందుగానే పూర్తయినందున జూన్ 4న ప్రకటించారు.
Congress: ఇది పేపర్ లీక్ ప్రభుత్వం.. యూజీసీ - నెట్ పరీక్షల రద్దుతో బీజేపీపై విరుచుకుపడిన కాంగ్రెస్
For Latest News and National News click here
Updated Date - Jun 20 , 2024 | 10:42 AM