Neom Project: నియోమ్‌లో రక్త చరిత్ర!
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:23 AM
నియోమ్. ఎర్ర సముద్రం ఉత్తర ప్రాంతంలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్మిస్తున్న కలల ప్రాజెక్టు. ‘సౌదీ విజన్-2030’ పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 2017 నుంచి నిర్మాణంలో ఉంది.
8 సౌదీ అధునాతన పట్టణ నిర్మాణంలో 21 వేల మంది కార్మికుల దుర్మరణం
8 మృతులలో భారతీయులు కూడా
న్యూఢిల్లీ, అక్టోబరు 30: నియోమ్. ఎర్ర సముద్రం ఉత్తర ప్రాంతంలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్మిస్తున్న కలల ప్రాజెక్టు. ‘సౌదీ విజన్-2030’ పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 2017 నుంచి నిర్మాణంలో ఉంది. అయితే.. ఈ నిర్మాణానికి సంబంధించి అనేక విషయాలు కథలుకథలుగా ప్రపంచం ముందుకు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇవ్వని సుమారు లక్ష మంది ప్రజల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం ఒక ఎత్తయితే.. తాజాగా మరో దిగ్ర్భాంతికర విషయం వెలుగు చూసింది. ఐటీవీ డాక్యుమెంటరీ ప్రకారం.. నియోమ్ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కార్మికుల్లో గత ఎనిమిదేళ్లుగా 21 వేల మంది మృతి చెందారు.
సౌదీలోని అత్యంత దుర్భర వాతావరణ పరిస్థితుల్లోవారు పనిచేయడం కారణంగా మృతి చెందినట్టు డాక్యుమెంటరీ స్పష్టం చేసింది. అంతేకాదు, కార్మికుల విషయంలో మానవ హక్కులను కూడా తుంగలో తొక్కుతున్నారని తెలిపింది. కార్మికులను బానిసలుగా, అడుక్కుతినేవారిగా(బెగ్గర్స్) పరిగణిస్తున్నారన్నది డాక్యుమెంటరీ సారాంశం. మానవ హక్కుల హరణంతో పాటు రోజుకు 16 గంటలకుపైగా పనిచేయిస్తుండం, వేతనాలు చెల్లించకపోవడం వంటివి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని డాక్యుమెంటరీ పేర్కొంది. గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో నియోమ్ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు సంబంధించిన విశేషాలతో ఐటీవీ తాజాగా డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
వాస్తవానికి సౌదీ చట్టాల ప్రకారం వారానికి 60 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉన్నా.. నియోమ్ విషయంలో ఈ చట్టాలను కూడా పాటించకుండా 84 గంటలపాటు పనిచేయిస్తున్నట్టు కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 నెలలుగా రూపాయి వేతనం కూడా ఇవ్వలేదని చాలా మంది కార్మికులు తెలిపారు. నియోమ్ నిర్మాణ సమయంలో మృతి చెందిన కార్మికుల్లో భారత్ సహా బంగ్లాదేశ్, నేపాల్‌కు చెందిన వారు ఉన్నారని ఐటీవీ డాక్యుమెంటరీ వెల్లడించింది. ఇక, నేపాల్ విదేశాంగ శాఖ ఈ విషయంపై ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. తమ దేశానికి చెందిన 650 మందికిపైగా కార్మికులు మృతి చెందారని, దీనికి రెండింతల మంది కనిపించకుండా పోయారని పేర్కొంది.
సల్మాన్ కలల ప్రాజెక్టు
మహమ్మద్ బిన్ సల్మాన్.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టు టుబక్ ప్రావిన్స్‌లోని నియోమ్. సౌదీని ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చాలన్న కుతూహలంతో ఆయన ‘సౌదీ విజన్-2030’ పేరుతో ఈ ప్రాజెక్టును 2017లో చేపట్టారు. సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ నిర్మిస్తున్న నియోమ్.. ప్రపంచానికే తలమానికంగా మారనుందని సౌదీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వలస కార్మికులు దోపిడీకి గురవుతున్నారని, స్థానికులు లక్షల సంఖ్యలో కనిపించకుండా పోయారని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.
Updated Date - Oct 31 , 2024 | 05:23 AM