Bihar: సీఎం పదవి నితీష్‌కే, ఇద్దరు బీజేపీ డిప్యూటీలు, ఆదివారమే ప్రమాణం..!
ABN, Publish Date - Jan 26 , 2024 | 03:23 PM
బీహార్‌లో నితీష్ కుమార్ సారథ్యంలోని మహాకూటమి నిట్టనిలువుగా చీలనుందా? జేడీయూ, ఆర్జేడీ మధ్య తలెత్తిన లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయా? కమలనాథులతో తిరిగి నితీష్ జేడీయూ పొత్తు పెట్టుకుని అధికారం కొనసాగించనుందా? అవుననే స్పష్టమైన కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి.
పాట్నా: బీహార్‌లో నితీష్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోని మహాకూటమి (JDU, Congress, RJD) నిట్టనిలువుగా చీలనుందా? జేడీయూ, ఆర్జేడీ మధ్య తలెత్తిన లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నాయా? కమలనాథులతో తిరిగి నితీష్ జేడీయూ పొత్తు పెట్టుకుని అధికారం కొనసాగించనుందా? అవుననే స్పష్టమైన కథనాలు వెలువడుతున్నాయి. బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ (Nitish Kumar) ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు నితీష్ క్యాబినెట్‌లోకి రానున్నారని, ఈనెల 28వ తేదీ ఆదివారంనాడు నితీష్ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని వారంటున్నారు.
అసెంబ్లీ రద్దు కాదు...
అసెంబ్లీని రద్దు చేయడం కానీ, ఎన్నికలకు వెళ్లడం కానీ ఇప్పటికిప్పుడు జేడీయూ ఆలోచనగా లేదని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఎలాగూ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున తిరిగి ఎన్నికలకు వెళ్లడం కంటే లోక్‌సభ ఎన్నికలపైనే దృష్టి సారించాలని జేడీయూ ఆలోచనగా ఉందంటున్నారు. సీఎంగా కొనసాగేందుకు ఎప్పటికప్పుడు పొత్తులు మార్చడంలో సిద్ధహస్తుడిగా పేరున్న నితీష్ ఈనెల 28వ తేదీన అనుకున్న ముందస్తు కార్యక్రమాలను కూడా రద్దుచేసుకున్నారని చెబుతున్నారు. అదేరోజు బీజేపీ మద్దతుతో ఆయన ఏడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు లేకపోలేదంటూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - Jan 26 , 2024 | 03:56 PM