No Pension: పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్.. సర్కార్ సంచలన నిర్ణయం
ABN, Publish Date - Sep 04 , 2024 | 07:15 PM
హిమచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఏదైనా ఒక సమయంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇక నుంచి పెన్షన్ పొందే వీలుండదని బిల్లులో పేర్కొన్నారు.
సిమ్లా: పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ (Pension) సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన బిల్లుపై చర్చ అనంతరం రాష్ట్ర అసెంబ్లీ బుధవారంనాడు ఆమోదించింది.
హిమచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పెన్షన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఏదైనా ఒక సమయంలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఇక నుంచి పెన్షన్ పొందే వీలుండదని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. అనంతరం సీఎం మాట్లాడుతూ, కొందరు (ఎమ్మెల్యేలు) రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి పద్ధతులకు పాల్పడుతుంటారనీ, ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి ఈ బిల్లు చాలా అవసరమని చెప్పారు. హిమాచల్ ప్రభుత్వం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించినట్టు తెలిపారు.
Sharad Pawar: సీఎం కుర్చీ కోసం పేచీల్లేవు
దీనికి ముందు ఫిబ్రవరి 29న ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేశారు. వీరిపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 34కు పడిపోయింది. అయితే ఆ తర్వాత విధానసభ ఉప ఎన్నికల్లో తిరిగి 40 స్థానాలకు కాంగ్రెస్ చేరుకుంది. విపక్ష బీజేపీకి అసెంబ్లీలో 28 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
Read More National News and Latest Telugu New
Updated Date - Sep 04 , 2024 | 07:19 PM