Jaipur: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే నో ప్రమోషన్.. హైకోర్టు ఏమందంటే
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:09 AM
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు(Promotions in Govt Jobs) కల్పించొద్దనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై.. ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
జైపుర్: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కన్న ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు(Promotions in Govt Jobs) కల్పించొద్దనే రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై.. ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రాజస్థాన్ ప్రభుత్వం ఇదివరకే ఈ విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్‌పై ప్రభావం పడింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అప్పటి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. ఉద్యోగుల పిల్లల సంఖ్య ఆధారంగా పదోన్నతులు కల్పించకూడదని నిర్ణయించింది. ఇప్పుడు ఇదే అంశంపై రాజస్థాన్ హైకోర్టుకు చెందిన జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ వినోద్ కుమార్ భర్వానీలతో కూడిన ధర్మాసనం మధ్యంతర స్టే విధించింది.
భిన్నంగా సుప్రీం కోర్టు తీర్పు..
రాజస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కావాలంటే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉండరాదని 2001లో నిబంధనలు పెట్టింది. దీన్ని 2017లో పదవీ విరమణ చేసి, 2018లో రాజస్థాన్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న మాజీ సైనికుడు రామ్ లాల్ జాట్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. రాజస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. 2001లో చేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ప్రకారం పిటిషనర్ రామ్ లాల్ 2018లో దరఖాస్తు చేసుకున్న పోలీసు ఉద్యోగానికి అనర్హతకు గురయ్యాడు. ఇదే అంశంపై 2022లో రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు.
అక్కడా ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 2002 జూన్ 1 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తూ రూపొందించిన నిబంధనల ప్రకారం ఈయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని కలిగి రాష్ట్రాల్లో రాజస్థాన్‌తో పాటు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటకలూ ఉన్నాయి.
మహారాష్ట్రలో..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మహారాష్ట్ర ఇదే విధానాన్ని కలిగి ఉంది. అయితే ప్రభుత్వం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన ఉద్యోగి మరణిస్తే, అతని కుటుంబ సభ్యులు లేదా పిల్లలలో ఎవరిని కూడా కారుణ్య నియామకం ఆధారంగా భర్తీ చేయదు. కారుణ్య నియామకాల్లో ఉద్యోగి మరణిస్తే ఆయన/ఆమె కుటుంబ సభ్యుల్లోని ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు.
For Latest News click here
Updated Date - Aug 31 , 2024 | 11:14 AM