No-Confidence Motion : రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాసం
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:29 AM
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్‌పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జేడీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్ తదితర
దేశ చరిత్రలోనే మొదటిసారి..
తీర్మానంపై 60 మంది ‘ఇండియా’ ఎంపీల సంతకాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై రాజ్యసభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్‌పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జేడీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, జేఎంఎం, ఆప్ తదితర పార్టీలకు చెందిన 60 మంది ఎంపీలు దానిపై సంతకాలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేశ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్ సదరు తీర్మానాన్ని మంగళవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి అందజేశారు. అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఇతర పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ తీర్మానంపై సంతకాలు చేయలేదు.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నందున కాంగ్రెస్ అగ్రనేతలు సంతకాలు పెట్టలేదని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. మరోవైపు.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మంగళవారం కూడా ఎలాంటి కార్యకలాపాలు జరుగలేదు. ఉభయసభల్లోనూ పెద్దఎత్తున గందరగోళం చెలరేగింది. పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో చార్జిషీటు, ఆయనతో ప్రధాని మోదీ సంబంధాలపై చర్చకు కాంగ్రెస్ యథాప్రకారం పట్టుబట్టింది. బీజేపీ ఎదురుదాడికి దిగింది. అమెరికా ఇండస్ట్రియలిస్ట్, భారత వ్యతిరేకి జార్జి సొరో్‌సతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లింకులున్నాయని.. ఆ పార్టీ దేశద్రోహానికి పాల్పడుతోందని.. ఈ అంశంపై చర్చించాలని డిమాండ్ చేసింది.
పరస్పర ఆరోపణలు, నినాదాలతో ఉభయసభలూ అట్టుడికాయి. దీంతో ఎలాంటి కార్యకలాపాల్లేకుండానే సభలు బుధవారానికి వాయిదాపడ్డాయి. కాగా.. దన్‌ఖడ్ ఎగువ సభలో అధికార కూటమికి అనుకూలంగా అత్యంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనపై ఇండియా కూటమి అవిశ్వాసం ప్రతిపాదించిందని ‘ఎక్స్’లో తెలిపారు. ధన్‌ఖడ్‌తో పలు అంశాలపై విపక్ష ఎంపీలకు విభేదాలు ఉన్నాయి. తమపై దాడికి అధికార పక్షానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని వారు గుర్రుగా ఉన్నారు. గత ఆగస్టులోనే అవిశ్వాసం పెట్టాలనుకున్నా ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని భావించారు.
తాజా సమావేశాల్లో సొరో్‌స-సోనియా లింకులపై చర్చకు బీజేపీ సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరించిన చైర్మన్.. తిరిగి ఆ అంశాన్ని జీరో అవర్‌లో ప్రస్తావించేందుకు అనుమతివ్వడంతో కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. దీంతో ఆయనపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. ఇతర ఇండియా కూటమి ఎంపీలు కూడా మద్దతిచ్చారు. రాజ్యాంగంలోని 67 (బీ), 92, 100వ అధికరణల ప్రకారం.. రాజ్యసభ చైర్మన్‌ను తొలగించాలంటే తొలుత సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఓటింగ్ రోజు హాజరైన సభ్యుల్లో సగం మంది కంటే ఒకరు ఎక్కువగా దానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన్ను తొలగించడం సాధ్యపడుతుంది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కూడా కావడంతో లోక్‌సభలోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా..ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు సాంకేతికంగా వీలుపడదని.. 14 రోజుల ముందు తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని.. ఇంకో 8 రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియనున్నాయని రాజ్యసభ సచివాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
అయితే రాజ్యసభలో ఎన్‌డీఏకి పూర్తి మెజారిటీ ఉందని.. ఈ తీర్మానాన్ని తిరస్కరించడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వ్యాఖ్యానించారు. ‘రాజ్యసభ చైర్మన్ మనకు మార్గదర్శి. సభ సజావుగా నడిచేందుకు ఆయన చెప్పేది అందరూ వినాలి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎల్లప్పుడూ చైర్మన్‌ను అవమానిస్తుంటాయి’ అని ధ్వజమెత్తారు. విపక్షాలకు రాజ్యాంగ నియమాలు తెలియవని.. ఉపరాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టరాదని బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ అన్నారు. 67(బీ) అధికరణ ప్రకారం అభిశంసన తీర్మానం మాత్రమే ప్రవేశపెట్టాలని చెప్పారు. ధన్‌ఖడ్‌పై ఒత్తిడి తేవడానికి విపక్షం ప్రయత్నిస్తోందన్నారు. టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. ఈ తీర్మానం ఆమోదానికి తగిన సంఖ్యాబలం తమకు లేదని.. కానీ ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం పోరాడేందుకు బలమైన సందేశంగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఏ వ్యక్తిపైనా తమకు ఎలాంటి వ్యతిరేకతా లేదన్నారు.
అదానీ-మోదీ సంచులతో నిరసన..
కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో వినూత్నంగా నల్ల జోలెలు ధరించి నిరసనకు దిగారు. ఆ సంచులకు ఓవైపు అదానీ, మోదీ చిత్రాలు.. ఇంకోవైపు ‘అదానీ-మోదీ భాయ్ భాయ్’ అన్న నినాదం ముద్రించారు. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా సహా కాంగ్రెస్, డీఎంకే, జేఎంఎం, వామపక్ష ఎంపీలు మకరద్వారం మెట్ల ముందు నిరసన చేపట్టారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాహుల్ కాంగ్రెస్ ఎంపీలతో పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమయ్యారు. వివిధ అంశాలపై పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై సమీక్షించారు. పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచి సభల లోపలే గాక వెలుపల కూడా ఇండియా కూటమి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
Updated Date - Dec 11 , 2024 | 10:43 AM