ఉపరాష్ట్రపతిపై అభిశంసన నోటీసు తిరస్కరణ
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:37 AM
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసు తిరస్కరణకు గురయింది. దీన్ని తిరస్కరిస్తున్నట్టు రాజ్యసభ వైస్‌చైర్మన్ హరివంశ్ గురువారం సభలో ప్రకటించారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 19: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్‌ను పదవి నుంచి తొలగించేందుకు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసు తిరస్కరణకు గురయింది. దీన్ని తిరస్కరిస్తున్నట్టు రాజ్యసభ వైస్‌చైర్మన్ హరివంశ్ గురువారం సభలో ప్రకటించారు. దన్‌ఖడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నందువల్ల ఆయనను అభిశంసిస్తామని పేర్కొంటూ 60 మంది సభ్యులు ఈ నెల 10న నోటీసు ఇచ్చారు. ఆ నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి మోదీ సభలో ప్రవేశపెట్టారు. దీనిని అందుకోగానే దన్‌ఖడ్ దానిని వైస్‌చైర్మన్‌కు అందజేశారు. తన స్థానం నుంచి తప్పుకొన్నారు. ఈ నోటీసుపై హరివంశ్ వ్యాఖ్యానిస్తూ ఇది అనుచితమైనది, దన్‌ఖడ్ పరువుకు భంగం కలిగించేలా హడావిడిగా ఇచ్చినదని పేర్కొన్నారు. లోపభూయిష్టంగా ఉందని, రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసేదని తెలిపారు. ఇందులో వాస్తవాలు లేవని, దన్‌ఖడ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారని చెప్పారు. ఉపరాష్ట్రపతిని అప్రతిష్ఠ పాల్జేయడానికి ఇచ్చిన ఈ నోటీసు ఆందోళనకరమని, ఇది పార్లమెంటు, సభ్యుల ప్రతిష్ఠకు భంగకరమని అన్నారు. అందువల్ల తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ దన్‌ఖడ్ వ్యవహార శైలిని ఎత్తిచూపుతూ తాను గతంలో ఆయనకు లేఖ రాశారని తెలిపారు. తాను ప్రస్తావించిన అంశాలకు ఆయన కూడా అంగీకరించారని చెప్పారు.
Updated Date - Dec 20 , 2024 | 03:37 AM