Katchatheevu islands row: కొందరు వేగంగా రంగులు మారుస్తుంటారు.. జైశంకర్‌పై చిదంబరం వ్యంగ్యోక్తులు
ABN, Publish Date - Apr 01 , 2024 | 04:55 PM
కచ్చాతీవు ద్వీపం వ్యహహారం అకస్మాత్తుగా తెరపైకి వచ్చినది కాదంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తాజాగా కౌంటర్ ఇచ్చారు. కొందరు ''చాలా వేగంగా రంగులు మారుస్తుంటారు'' అంటూ జైశంకర్‌పై విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: కచ్చాతీవు ద్వీపం (Katchatheevu Islands)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారడం లేదు. కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించడం ఇందిరాగాంధీ చేసిన ఘోర తప్పిదమంటూ మోదీ వ్యాఖ్యానించడం, ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సోమవారం వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం (P.Chidambaram) తాజాగా కౌంటర్ ఇచ్చారు. కొందరు ''చాలా వేగంగా రంగులు మారుస్తుంటారు'' అంటూ జైశంకర్‌పై విమర్శలు గుప్పించారు.
''దెబ్బకు దెబ్బ (టిట్ ఫర్ టాట్) అనేది పాత సామెత. ట్వీట్‌కు ట్వీట్ అనేది కొత్త ఆయుధం'' అని సామాజిక మాధ్యమంలో చిదంబరం పోస్ట్ చేశారు. 27-1-2015 తేదీతో ఆర్‌టీఐ సమాధానాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్ పరిశీలించాలి. అప్పుడు జైశంకర్ ఎఫ్ఎంగా ఉన్నారు. ఒక చిన్న ద్వీపం శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్‌టీఐ రిప్లై సమర్ధించింది. విదేశాంగ మంత్రి, ఆయన మంత్రిత్వ శాఖ ఇప్పుడెందుకు రాద్ధాంతం వేస్తున్నారు? ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో'' అని చిందబరం ట్వీట్ చేశారు. లిబరల్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ నుంచి స్మార్ట్ ఫారెన్ సెక్రటరీ, ఆర్ఎస్ఎస్-బీజేపీ మౌత్‌పీస్ వరకూ జైశంకర్ ఎదిగిన వైనాన్ని చిదంబరం తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
జైశంకర్ ఏమన్నారు?
కచ్చాతీవు వ్యవహారం అకస్మాత్తుగా తెరపైకి వచ్చిందని కాదని జైశంకర్ అన్నారు. ఇది సజీవ సమస్య అని చెప్పారు. పార్లమెంటుంలో కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉందన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 21 సార్లు తాను సమాధానమిచ్చినట్టు చెప్పారు. గత 20 ఏళ్లలో 6,148 మందికి పైగా భారతీయ మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించిందని, 1,175 పడవలను స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఈ నేపథ్యాన్నే తాము చర్చిస్తున్నామన్నారు. ''ఇదెవరు చేశారో మాకు తెలుసు, దీన్ని దాచిపెడుతున్నదెవరో మాకు తెలియదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని మేము నమ్ముతున్నాం'' అని జైశంకర్ వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 04:58 PM