Govt of india : పాన్ పరేషాన్
ABN, Publish Date - Jun 19 , 2024 | 05:52 AM
మరణించిన వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు, తరచూ పాన్ కార్డు వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తాజాగా ఒక కథనంలో వెల్లడించింది.
భారీ స్కామ్‌లా పాన్ కార్డుల దుర్వినియోగం
మరణించిన వారి పేరిట లావాదేవీలు
వృద్ధులు, రైతులు, కార్డు వాడని వారే టార్గెట్
ఐటీ నోటీసులతో బాధితులు లబోదిబో
దేశవ్యాప్తంగా పలుచోట్ల కేసుల నమోదు
న్యూఢిల్లీ, జూన్ 18: మరణించిన వారు, నిరక్షరాస్యులు, వృద్ధులు, రైతులు, తరచూ పాన్ కార్డు వినియోగించని వ్యక్తుల పాన్ నంబర్లు దుర్వినియోగానికి గురవుతున్నాయని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తాజాగా ఒక కథనంలో వెల్లడించింది. ఐటీ శాఖ వారికి నోటీసులు పంపిన తర్వాతే ఇలాంటివి వెలుగులోకి వస్తున్నాయని తెలిపింది.
దీనికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయని అందులో పేర్కొంది. ముంబైకి చెందిన ఒక వృద్ధురాలు.. తన పాన్‌కార్డును దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ)లో కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2010-11లో ఆమె రూ.1.3 కోట్ల విలువైన ఆస్తిని తన ఆదాయంగా భావించి విక్రయించినట్టు ఐటీ అధికారులు ఐటీఏటీకి నివేదించారు. గతంలో ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఆమె స్పందించలేదని ఆరోపించారు.
ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా.. ఆ వృద్ధురాలికి అవగాహన లేకపోవడం, కేన్సర్ రోగి కావడంతో గతంలో ఐటీశాఖ నోటీసులకు స్పందించలేదని ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ట్రైబ్యునల్‌కు తెలిపారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలో ఆమె పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని వాదనలు వినిపించారు. ఇదొక్కటే కాదు.. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు చాలా వెలుగుచూస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఉషా సోనీ అనే వ్యక్తికి ఆమె మరణించిన పదేళ్ల తర్వాత రూ.7.5 కోట్లకు సంబంధించిన ఐటీ నోటీసులు అందాయి. అదేవిధంగా రాజస్థాన్‌కు చెందిన నందన్ లాల్ అనే చిరు వ్యాపారికి రూ.12.2 కోట్లకు ఐటీ నోటీసులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘పాన్ విషయంలో అత్యంత గోప్యత పాటించాల్సి ఉన్నా ప్రజలు వివిధ అవసరాల కోసం ఆ వివరాలను యథేచ్చగా పంచుకుంటున్నారు’ అని చార్టర్డ్ అకౌంటెంట్ చేతన్ వజానీ అన్నారు. సీబీడీటీ కూడా దీనిపై స్పందించింది. వ్యక్తులు తమ పాన్ వివరాలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరి కాని చోట, పబ్లిక్ డొమైన్‌లలో పంచుకోకూడదని సూచించింది. ఎవరికైనా తమ పాన్ కార్డు దుర్వినియోగమైనట్టు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. కాగా, వివిధ ఏజెన్సీలు దాఖలు చేసిన సమాచారంపై పూర్తిగా ఆధారపడుతున్న ఐటీ శాఖ.. పన్ను చెల్లింపుదారులపై చర్యలు తీసుకోవడం తీవ్రమైన అంశమని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసినప్పుడల్లా ఆ సమాచారం ఐటీ శాఖకు వెళ్లేలా ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Updated Date - Jun 19 , 2024 | 05:52 AM