పార్లమెంట్ నిరవధిక వాయిదా
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:12 AM
అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, వాగ్వాదాల మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, వాగ్వాదాల మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. రాజ్యాంగంపై చర్చ, జమిలి ఎన్నికలపై బిల్లును జేపీసీకి పంపడం మినహా ఈ సమావేశాల్లో పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారంటూ విపక్షాలు ఆరోపించడం, అధికార పక్ష సభ్యులు అడ్డుకోవడంతో ఉభయసభలు అట్టుడికాయి. చివరి రోజు కూడా ఇదే విషయంపై విపక్షాల నిరసనలు కొనసాగడంతో ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు లోక్‌సభ ప్రారంభమైన 3 నిమిషాలకే స్పీకర్‌ఓం బిర్లా సభను వాయిదా వేశారు. అంతకు ముందు తేనీటి విందుకు రావాలని స్పీకర్ ఆహ్వానించినా విపక్ష సభ్యులు రాలేదు. నవంబరు 25న శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా మొత్తం 3 సెషన్లలో 70 పనిగంటలను లోక్‌సభ కోల్పోయింది. తద్వారా 57.87 శాతం మాత్రమే పనిచేసింది. రాజ్యసభలోనూ విపక్షాల ఆందోళనతో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. చివరి రోజు ఆయిల్ ఫీల్డ్స్ సవరణ బిల్లు, 2024 బాయిలర్స్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 43 గంటల 27 నిమిషాలు పనిచేసింది. 40.03 శాతం మాత్రమే పనిచేసింది. కాగా, దేశవ్యాప్తంగా లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేసేందుకు కేంద్రం జేపీసీలో మొత్తం 39కి చోటు కల్పించింది. సభ్యుల్లో 27 మంది లోక్‌సభకు, 12 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 12 మందిలో తెలంగాణ నుంచి కె.లక్ష్మణ్, ఏపీ నుంచి విజయసాయిరెడ్డికి స్థానం కల్పించారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.’
Updated Date - Dec 21 , 2024 | 04:12 AM