PM Modi: ఫుట్‌బాల్ అంటే మాకూ ఇష్టమే: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 28 , 2024 | 03:37 PM
స్పెయిన్ లో మాదిరిగానే భారతీయులు కూడా మ్యాచ్ ఉద్విగ్నతకు లోనయ్యారని.. మ్యాచ్ ఫీవర్ భారత్ లోనూ ఉందని మోదీ తెలిపారు.
వడోదర: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ భారత్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో కలిసి ఆయన గుజరాత్ లోని వడోదరలో ఇవాళ పర్యటంచారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన స్పానిష్ ఫుట్ బాల్ ఆట గురించి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ఆటను భారత ప్రజలు కూడా ఎంతో ఇష్టపడతారని మోదీ అన్నారు. మ్యాచ్ సందర్భంగా స్పెయిన్ లో మాదిరిగానే భారతీయులు కూడా ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యారని.. మ్యాచ్ ఫీవర్ భారత్ లోనూ ఉందని తెలిపారు.
ఫుట్ బాల్ అంటే మాకూ ప్రాణమే..
‘‘భారతీయులు స్పానిష్ పుట్‌బాల్ ఆటను ఎంతో ఇష్టపడతారు. నిన్న జరిగిన రియల్ మాడ్రిడ్, బార్సిలోనా మ్యాచ్ గురించి ఇక్కడ కూడా చర్చనడిచింది. బార్సిలోనా అద్భుత విజయాన్ని ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇరు జట్లకు సంబంధించిన అభిమానులు ఇక్కడ కూడా ఉన్నారు. నిన్న మ్యాచ్ కోలాహలం స్పెయిన్ తో పాటు భారత్ లోనూ కనపడిందని నేను చెప్పగలను‘‘ అని వడోదర రోడ్‌షోలో ప్రసంగిస్తూ మోదీ వివరించారు. లాలిగా టోర్నీలో భాగంగా రియల్ మాడ్రిడ్ జట్టును బార్సిలోనా 4-0 తేడాతో ఓడించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్ విజయం గురించి మోదీ ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆటపై ఆయనకున్న పరిజ్ఞానం చూసి పలువురు ప్రశంసిస్తున్నారు.
స్పెయిన్ తో బంధం బలోపేతం..
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఇద్దరూ కలిసి సోమవారం గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముందు ఇద్దరూ కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ రోజు (సోమవారం) ఇరుదేశాధి నేతలు చారిత్రాత్మకమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని మోదీ అన్నారు.