Narendra Modi: 15 విమానాశ్రయ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Mar 10 , 2024 | 01:04 PM
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రధాని ఉత్తర్ ప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాకు చేరి రూ.34,700 కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఆదివారం ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)లోని అజంగఢ్(Azamgarh) జిల్లాలో మండూరి విమానాశ్రయ సముదాయంలో రూ.34,700 కోట్లతో 782 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 12 కొత్త టెర్మినల్ భవనాలతో సహా 15 విమానాశ్రయ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో అజంగఢ్, శ్రావస్తి, మొరాదాబాద్, చిత్రకూట్, అలీఘర్ విమానాశ్రయాలు ఉన్నాయి. దీంతోపాటు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం, లక్నో కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవం కూడా కలవు.
దీంతోపాటు అజంగఢ్(Azamgarh), శ్రావస్తి, మొరాదాబాద్, చిత్రకూట్, అలీగఢ్, జబల్పూర్, గ్వాలియర్, లక్నో, పూణే, కొల్హాపూర్, ఢిల్లీ, అదంపూర్ వంటి అనేక విమానాశ్రయాలలో కొత్త టెర్మినల్ భవనాలు ప్రారంభించబడ్డాయి. ఇది కాకుండా అజంగఢ్‌లోని మహారాజా సుహెల్‌దేవ్ స్టేట్ యూనివర్శిటీని కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో రైలు, రోడ్డుతో సహా అనేక ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ(modi) ప్రసంగించారు. ఆధునిక మౌలిక సదుపాయాల పనులను చిన్న నగరాలకు తీసుకెళ్తున్నామని మోదీ చెప్పారు. పెద్ద మెట్రో నగరాల మాదిరిగానే చిన్న నగరాలు కూడా ఈ అభివృద్ధికి అర్హులని వెల్లడించారు. మేము ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని టైర్ 2, టైర్ 3 నగరాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇది సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌కు నిదర్శనమని వెల్లడించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం(double engine sarkar) ప్రాథమిక మంత్రం ఇదేనని తెలిపారు. మన ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడమే ప్రధానమని అన్నారు. నేడు అజంగఢ్ మాత్రమే కాకుండా దేశం మొత్తం అభివృద్ధి కోసం ఇక్కడ నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో నేడు దేశాభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని పేర్కొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Arvind Kejriwal: మోదీ పేరు తలిస్తే మీ భర్తకు ఫుడ్ పెట్టొద్దు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
Updated Date - Mar 10 , 2024 | 01:04 PM