NDA government : గత ఏడాదిన్నరలో..10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
ABN, Publish Date - Dec 24 , 2024 | 06:06 AM
కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇదో రికార్డు అని.. ఇంతవరకు ఏ సర్కారూ ఇన్ని ఉద్యోగాలు
వీరిలో అత్యధిక మంది మహిళలే
ఇదో రికార్డు: ప్రధాని మోదీ
ఢిల్లీ రోజ్‌గార్ మేళాలో 71 వేల మందికి నియామక పత్రాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 23: కేంద్రంలోని ఎన్‌డీయే ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇదో రికార్డు అని.. ఇంతవరకు ఏ సర్కారూ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాల్లేవని చెప్పారు. సోమవారమిక్కడ ‘రోజ్‌గార్ మేళా’కు ఆయన వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 71 వేల మందికిపైగా నియామక పత్రాలు అందజేశారు. తన ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలన్నీ యువత కేంద్రకంగానే ఉన్నాయని ప్రధాని చెప్పారు. రోజ్‌గార్ మేళాలతో వారికి సాధికారత లభిస్తోందని.. వారి సామర్థ్యం వెలికివస్తోందని అన్నారు. ‘పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారిలో అత్యధికులు మహిళలే. అతివలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు మా ప్రభుత్వం కృషిచేస్తోంది. 26 వారాలు మాతృత్వ సెలవులివ్వాలన్న నిర్ణయం వారి కెరీర్లకు ఎంతో ఉపకరిస్తోంది. ప్రధాని ఆవాస్ యోజన కింద నిర్మించే ఇళ్లకు వారే యజమానులు. దేశంలో వారి నేతృత్వంలోనే అభివృద్ధి సాగుతోంది. మన యువత శక్తి సామర్థ్యాలను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. వారి కోసమే పలు పథకాలు తెచ్చాం. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, అంతరిక్ష, రక్షణ రంగాల్లో సంస్కరణలు ఈ కోవలోవే. యువత అభివృద్ధికి జాతీయ విద్యావిధానం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మాతృభాషల ఉపయోగానికి పెద్దపీట వేస్తోంది’ అని వివరించారు. సోమవారం మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జయంతిఅని.. దేశ పురోగతికి గ్రామీణ భారతం అభివృద్ధి అని ఆయన గట్టిగా చెప్పేవారని.. దానినే తన ప్రభుత్వం పాటిస్తోందని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని.. స్వయం ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం తమ అదృష్టమన్నారు. కఠోర శ్రమ, సామర్థ్యం, యువత నాయకత్వంపై దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు. 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తామని తెలిపారు. భారత్ ఇప్పుడు ఐదో పెద్ద ఎకానమీగా ఉందని.. వివిధ రంగాల్లో పరివర్తన దిశగా కదులుతోందని చెప్పారు.
కేథలిక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరు
భారతీయ కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) సోమవారం ఢిల్లీలోని తమ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. భారతీయ కేథలిక్ చర్చి హెడ్‌క్వార్టర్స్ ఇది. ఇక్కడి వేడకల్లో దేశ ప్రధాని పాల్గొనడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా మోదీ ప్రసంగించారు. ప్రేమ, సామరస్యం, సౌభ్రాతృత్వంతో మెలగాలని ఏసుక్రీస్తు ప్రబోధించారని.. కానీ సమాజంలో హింస, అనైతికతల వ్యాప్తికి జరుగుతున్న ప్రయత్నాలు తనను బాధిస్తున్నాయని తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ పవిత్ర రోమన్ కేథలిక్ చర్చి కార్డినల్‌గా కేరళకు చెందిన జార్జ్ కూవకడ్‌కు పదోన్నతి కల్పించడం గర్వంగా ఉందన్నారు. (వాటికన్‌లో మాన్‌సైనర్ హోదాలో ఉన్న కూవకడ్ సహా 21 మందికి పోప్ అక్టోబరు 6న కార్డినల్స్‌గా నియమించారు. టర్కీలోని టైట్యులార్ ఆర్చ్‌బిషప్ ఆఫ్ నిసిబి స్‌గా ఆయన్ను ప్రకటించారు). వేడుకల సందర్భంగా చర్చి ముఖ్య అధికారులు, కార్డినల్స్, బిష్‌ప్సతో మోదీ ముచ్చటించారు.
Updated Date - Dec 24 , 2024 | 06:06 AM