PM Modi: ప్రపంచానికే నైపుణ్య రాజధాని భారత్!
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:46 AM
భారతీయుల శ్రమశక్తి, నైపుణ్యాలు నవ కువైత్ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని..
కువైత్‌లో ప్రవాసభారతీయులతో మోదీ.. నేడు ఆ దేశరాజు, ప్రధానితో సమావేశం
కువైత్ సిటీ, డిసెంబరు 21: భారతీయుల శ్రమశక్తి, నైపుణ్యాలు నవ కువైత్ నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయని.. ప్రపంచానికే నైపుణ్య రాజధాని అయ్యే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని మోదీ అన్నారు. రానున్న కొన్ని దశాబ్దాలపాటు ప్రపంచంలోనే అత్యంత యువ దేశంగా భారత్ ఉంటుందని పేర్కొన్నారు. కువైత్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కువైత్‌కు చేరుకున్న ప్రధాని.. ఇక్కడి ‘షేక్ సాద్ అల్ అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్’లో ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘మీరందరూ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఇక్కడ మినీ భారతదేశమే ఉన్నట్టుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఏటా భారతదేశం నుంచి కువైత్‌కు వస్తున్న వందలాది మంది భారతీయులు కువైత్ సమాజానికి భారతీయ ఆత్మను జోడిస్తారు. కువైత్ కాన్వా్‌సను.. భారతీయ నైపుణ్యాలు, ప్రతిభతో నింపేస్తారు’’ అని మోదీ కొనియాడారు. నలభైమూడేళ్ల క్రితం.. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత.. ఒక భారత ప్రధాని కువైత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. ‘‘ఇక్కడి నుంచి ఇండియాకు రావడానికి మీకు పట్టేది నాలుగు గంటలే. కానీ.. ఒక భారత ప్రధాని కువైత్‌కు రావడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది’’ అని పేర్కొన్నారు.
మాటకు కట్టుబడి..
‘ఎక్స్’ వేదికగా తాను ఇచ్చిన మాట ప్రకారం ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి, 101 సంవత్సరాల వయోవృద్ధుడు అయిన మంగళ్ సెయిన్ హండాను మోదీ ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. తన తాత మంగళ్ హండా ప్రధాని వీరాభిమాని అని.. కువైత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను కలిసి మాట్లాడాలని హండా మనవరాలు శ్రేయ జునేజా ‘ఎక్స్’ వేదికగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తప్పకుండా కలుస్తానని మోదీ ఎక్స్‌లోనే ఆమెకు సమాధానమిచ్చారు. నిజానికి మంగళ్ హండా 100వ పుట్టినరోజు సందర్భంగానే ప్రధాని మోదీ ఆయనకు వ్యక్తిగత లేఖ ద్వారా గతంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ప్రధాని వ్యక్తిగతంగా తనను కలవడంతో ఎంతగానో సంతోషించారు. కాగా.. ప్రధాని మోదీ ఆదివారంనాడు కువైత్ రాజును, ప్రధానమంత్రిని కలవనున్నారు.
మోదీకి సాదర స్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోదీ శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ రాజు ఆహ్వానం మేరకు అక్కడకు చేరుకున్న మోదీకి ఆ దేశ ఉప ప్రధాని షేక్ ఫహాద్ యూసుఫ్ సౌద్ అల్ సబహ్ విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు. అక్కడకు చేరుకున్న అనంతరం ప్రధాని ‘సలాహ్ మోదీ’ కార్యక్రమంలో భాగంగా మొదట ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఓ వైపు ప్రవాస భారతీయులంతా చప్పట్లు, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తుండగా అక్కడున్న వారందరినీ మోదీ పలకరించారు. రామాయణం, మహాభారతాలను అరబిక్‌లోకి అనువదించిన అబ్దుల్లా అర్ బెరూన్, ఈ ఇతిహాసాలను అరబిక్‌లో ప్రచురించిన అబ్దుల్ లతీఫ్ అల్ సెనె్‌ఫలను మోదీ పలకరించారు. ఈ పర్యటనలో అరేబియన్ గల్ఫ్ కప్ ఫుట్ బాల్ ప్రారంభ పోటీలకు మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు డిసెంబరు 1 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ధ్యానాన్ని తమ జీవితంలో ఓ భాగం చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని రన్ ఆఫ్ కచ్‌లో జరుగుతున్న ‘రన్ ఉత్సవ్’లో పాలుపంచుకోవాల్సిందిగా మోదీ అందరికీ ఆహ్వానం పలికారు.
Updated Date - Dec 22 , 2024 | 02:47 AM