ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన

ABN, Publish Date - Jun 03 , 2024 | 04:24 AM

కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక.. సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశంవైపు ఆశగా చూస్తోందని.. యువతే మన దేశానికి గొప్పబలమని ఆయన పేర్కొన్నారు.

ఆ గడ్డ సాగరాల సంగమ క్షేత్రమే కాదు.. దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా

  • మన సంస్కరణలు వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనకనుగుణంగా ఉండాలి

  • ప్రపంచం మనవైపు ఆశగా చూస్తోంది.. యువతే మనకు బలం

  • కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తూ విమానంలో ప్రధాని మోదీ వ్యాసం

  • మన సంస్కరణలు.. వికసిత్‌ భారత్‌

  • లక్ష్యసాధనకు అనుగుణంగా ఉండాలి

  • కాలం చెల్లిన ఆలోచనలు, విశ్వాసాలను పునర్నిర్వచించుకోవాల్సిన సమయమిది

  • ప్రపంచం మనవైపు ఆశగా చూస్తోంది.. యువతే మన దేశానికి గొప్ప బలం

  • కన్యాకుమారి నుంచి తిరుగుప్రయాణంలో విమానంలో ప్రధాని మోదీ వ్యాసం

కన్యాకుమారి సాగరాల సంగమ క్షేత్రమే కాక.. సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా అని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రపంచమంతా భారతదేశంవైపు ఆశగా చూస్తోందని.. యువతే మన దేశానికి గొప్పబలమని ఆయన పేర్కొన్నారు. ఏడో దశ ఎన్నికల ప్రచారం ముగిసినరోజు సాయంత్రమే కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్న ప్రధాని.. జూన్‌ 1న కన్యాకుమారి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు.. విమానంలోనే తన ఆలోచనలను ఒక వ్యాసంగా మలిచారు. అందులో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

కన్యాకుమారిలో మూడు రోజుల ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని ఇప్పుడే ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కాను. నా మనసంతా ఎన్నో అనుభవాలు, అనుభూతులతో నిండిపోయింది. నాలోనే లోలోన అవధుల్లేని శక్తి ప్రవాహాన్ని అనుభవిస్తున్నాను. కన్యాకుమారిలో భరతమాత పాదాల చెంత కూర్చున్న తొలి క్షణాల్లో.. ఎన్నికల హడావుడి నా మదిలో ప్రతిధ్వనించింది.

ర్యాలీలు, రోడ్‌ షోలలో నేను చూసిన లెక్కలేనన్ని ముఖాలు నా కళ్ల ముందుకొచ్చాయి.తల్లులు, సోదరీమణులు మరియు కుమార్తెల అపరిమితమైన ప్రేమ, వారి ఆశీస్సులు.. నా పట్ల వారి కళ్లలో ఉన్న నమ్మకం, ఆ ఆప్యాయత.. నేను ప్రతిదీ గ్రహించాను. నా కళ్లు తడిగా మారాయి. ఆ తర్వాత నేను ధ్యానంలోకి వెళ్లాను. కొద్ది క్షణాల్లోనే రాజకీయ వాదోపవాదాలు, దాడులు, ఎదురుదాడులు.. ఆరోపణల స్వరాలు, మాటలు అన్నీ వాటంతటవే శూన్యంలోకి వెళ్లిపోయాయి.


నా మనసు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా దూరమైంది. ఇంతటి బృహత్తర బాధ్యతల నడుమ ఇలాంటి సాధన కష్టమే అయినా.. కన్యాకుమారి భూమి, స్వామి వివేకానంద స్ఫూర్తితో అది సులువైంది. కన్యాకుమారిలో ఉదయించే సూర్యుడు నా ఆలోచనలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాడు. సముద్రం వైశాల్యం నా ఆలోచనలను విస్తరింపజేసింది. కన్యాకుమారి ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు..’’ అనే మాట దేశంలోని ప్రతి ఒక్కరి హృదయంలో నిక్షిప్తమైన ఒక ఉమ్మడి గుర్తింపు. శక్తి మాత కన్యాకుమారిగా అవతరించిన శక్తిపీఠం ఇది. ఈ దక్షిణ చివరలో శక్తి మాత తపస్సు చేసి, భారతదేశం యొక్క ఉత్తర చివరలో హిమాలయాలలో కూర్చున్న శివుని కోసం వేచి ఉంది. కన్యాకుమారి సంగమాల గడ్డ.

మన దేశంలోని పవిత్ర నదులు వివిధ సముద్రాలలో కలిస్తే.. ఆ సముద్రాలు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ మరొక గొప్ప సంగమం కనిపిస్తుంది. అది భారతదేశ సైద్ధాంతిక సంగమం! వివేకానంద రాక్‌ మెమోరియల్‌తో పాటు తిరువళ్లువర్‌ భారీ విగ్రహం, గాంధీ మండపం, కామరాజర్‌ మణి మండపం ఉన్నాయి. ఆ మహానుభావుల ఆలోచనా ప్రవాహాలు ఇక్కడ జాతీయ ఆలోచనల సంగమాన్ని ఏర్పరిచాయి. అది జాతి నిర్మాణానికి, గొప్ప ప్రేరణల ఆవిర్భావానికి దారితీసింది. దేశ ఐక్యతను శంకించే వారికి కన్యాకుమారి గడ్డ చెరగని ఐక్యతా సందేశాన్ని ఇస్తుంది.

  • సందేశం.. లక్ష్యం.. గమ్యం..

‘‘ప్రతి దేశానికీ అందించడానికి ఒక సందేశం ఉంటుంది. నెరవేర్చడానికి ఒక లక్ష్యం ఉంటుంది. చేరుకోవాల్సిన గమ్యం ఉంటుంది’’ అన్నారు స్వామి వివేకానంద. వేలాది సంవత్సరాలుగా భారతదేశం ఈ అర్థవంతమైన లక్ష్యంతో ముందుకు సాగుతోంది. భారతదేశం వేలాది సంవత్సరాలుగా ఆలోచనల పరిశోధన కేంద్రంగా ఉంది. మనం సంపాదించినదాన్ని ఎన్నడూ మన వ్యక్తిగత సంపదగా పరిగణించలేదు.


మన సంపాదనను పూర్తిగా ఆర్థిక, భౌతిక పరామితుల్లో తూకం వేయలేదు. అందుకే.. ‘ఇదం నమమ (ఇది నాది కాదు)’ అనే భావన భారతదేశ సహజ స్వభావంగా మారింది. భారతదేశ సంక్షేమం.. యావత్‌ ప్రపంచ శ్రేయోభివృద్ధి ప్రస్థానానికీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు.. మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి ప్రపంచంలో చాలా దేశాలు వలస పాలనలోనే ఉన్నాయి. మన స్వాతంత్య్ర ప్రస్థానం చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలిచి, స్వాతంత్ర్యాన్ని సాధించుకునే బలాన్నిచ్చింది. దశాబ్దాల తర్వాత అదే స్ఫూర్తి.. శతాబ్దానికొకసారి సంభవించే కొవిడ్‌-19 మహమమ్మారిని ప్రపంచం ఎదుర్కొంటున్నప్పుడు.. మరోసారి కనిపించింది. ఆ సమయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పుడు.. భారతదేశ విజయవంతమైన ప్రయత్నాలు అనేక దేశాలకు ధైర్యాన్ని, సహకారాన్ని అందించాయి.

భారతదేశ పాలన నమూనా నేడు ప్రపంచంలోని అనేక దేశాలకు ఉదాహరణగా మారింది. కేవలం పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం అపూర్వం. పేదల సాధికారతకు, వారి హక్కులను కాపాడడానికి, పారదర్శకతను తేవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపడం ద్వారా.. మన ‘డిజిటల్‌ ఇండియా’ ప్రచారం నేడు యావత్‌ ప్రపంచానికీఒక ఉదాహరణగా నిలిచింది. భారతదేశంలో చౌక ధరలకు లభిస్తున్న డేటా.. పేదలకు సమాచారం, సేవలు అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా సామాజిక సమానత్వ మాధ్యమంగా మారుతోంది. పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు మన నమూనా నుండి నేర్చుకోవాలని అనేక దేశాలకు సలహా ఇస్తున్నాయి. జీ-20 విజయం తర్వాత.. భారతదేశం మరింత బృహత్తర పాత్రను పోషించాలన్న భావన ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది. గ్లోబల్‌ సౌత్‌కు బలమైన, ముఖ్యమైన గొంతుగా భారత్‌కు ఆమోదం లభిస్తోంది.

  • పెద్ద లక్ష్యాల దిశగా..

నవ భారత అభివృద్ధి గతి.. మనలో గర్వాన్ని, సంతోషాన్ని నింపుతుంది. కానీ అదే సమయంలో అది 140 కోట్ల మంది దేశ ప్రజల బాధ్యతలను కూడా గుర్తుచేస్తుంది. ఇప్పుడు మనం ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పెద్ద పెద్ద బాధ్యతలు, పెద్ద లక్ష్యాల దిశగా అడుగులు వేయాలి.


కొత్త కలలు కనాలి. ఆ కలలను నిజాలుగా మార్చుకొని అందులో జీవించాలి. మన దేశ బలాలను గుర్తించి, వాటిని మరింతగా పెంచుకుని, ప్రపంచ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించాలి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఒక యువదేశంగా భారత్‌ బలం.. మనం వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని ఒక గొప్ప అవకాశం. 21వ శతాబ్దపు ప్రపంచం భారత్‌ వైపు ఎన్నో ఆశలతో చూస్తోంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ముందుకు సాగాలంటే మనం కూడా అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సంస్కరణల గురించి మన సంప్రదాయ ఆలోచనలను కూడా మార్చుకోవాలి.

ఆర్థిక సంస్కరణలకే పరిమితం కాక.. జీవితంలోని ప్రతి దశలో సంస్కరణల దిశగా ముందుకు సాగాలి. మన సంస్కరణలు కూడా.. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత భారత్‌)’ అనే తీర్మానానికి అనుగుణంగా ఉండాలి. సంస్కరణ అనేది ఏ దేశానికీ ఒకే దిశలో సాగే ప్రక్రియ కాదని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేశం కోసం నేను.. ‘సంస్కరణ, పనితీరు, పరివర్తన (రిఫామ్‌, పెర్‌ఫామ్‌ ట్రాన్స్‌ఫామ్‌)’ అనే విజన్‌ను ప్రతిపాదించాను. సంస్కరణల (రిఫామ్‌) బాధ్యత నాయకత్వంపై ఉంటుంది. దాని ఆధారంగానే అధికార యంత్రాంగం పని చేస్తుంది (పెర్‌ఫామ్‌). ప్రజలు కూడా అందులో భాగస్వాములైతే జరిగే పరివర్తనకు (ట్రాన్స్‌ఫామ్‌) మనమే సాక్షులుగా ఉంటాం.

అలాగే, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి.. మనం సమర్థతను మన ప్రధాన విలువగా మార్చుకోవాలి. తయారీతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ‘జీరో డిఫెక్ట్‌-జీరో ఎఫెక్ట్‌’ అనే మంత్రానికి కట్టుబడి ఉండాలి. భారత దేశంలో పుట్టేలా చేయడం ద్వారా భగవంతుడు మనను ఆశీర్వదించాడని ప్రతిక్షణం గర్వపడాలి.

ప్రాచీన విలువలను ఆధునిక రూపంలో అవలంబించడం ద్వారా మన వారసత్వాన్ని ఆధునిక పద్ధతిలో పునర్నిర్వచించాలి. కాలం చెల్లిన ఆలోచనలు, విశ్వాసాలను.. మనం పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతికూలత నుంచి విముక్తే.. విజయసాధన దిశగా పడే మొదటి అడుగనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. సానుకూలత ఒడిలో మాత్రమే విజయం వర్ధిల్లుతుంది.

20 శతాబ్దపు నాలుగవ, ఐదవ దశకాన్ని మన స్వాతంత్య్రం కోసం ఎలా ఉపయోగించుకున్నామో.. అదే విధంగా 21వ శతాబ్దపు ఈ 25 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన భారతదేశానికి పునాది వేయాలి. వచ్చే 50 ఏళ్లనూ దేశం కోసం మాత్రమే అంకితం చేయాలని స్వామి వివేకానంద 1897లో చెప్పారు. ఆయన పిలుపునిచ్చిన తర్వాత సరిగ్గా 50 ఏళ్లకు 1947లో భారత్‌ కు స్వాతంత్య్రం వచ్చింది. అలాంటి సువర్ణావకాశం ఈ రోజు మనకు లభించింది. రాబోయే 25 ఏళ్లనూ పూర్తిగా జాతికి అంకితం చేద్దాం. రాబోయే తరాలకు, రాబోయే శతాబ్దాలకు నవభారతానికి బలమైన పునాదిగా మన ఈ ప్రయత్నాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ రోజు దేశానికి ఉన్న శక్తిని, ఉత్సుకతను చూస్తుంటే.. లక్ష్యం మరెంతో దూరంలో లేదని చెప్పగలను. ఇకపై వేగంగా అడుగులు వేద్దాం... అందరం కలిసి ముందుకు సాగి భారత్‌ను అభివృద్ధి చేద్దాం.

- నరేంద్ర మోదీ

Updated Date - Jun 03 , 2024 | 08:23 AM

Advertising
Advertising