BSP: పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రం చేస్తాం.. మాయావతి సంచలన ప్రకటన
ABN, Publish Date - Apr 14 , 2024 | 09:42 PM
కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేస్తామని బీఎస్సీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి(Mayawati) సంచలన ప్రకటన చేశారు.
లక్నో: కేంద్రంలో అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రం చేస్తామని బీఎస్సీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి(Mayawati) సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్‌నగర్‌లో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
పశ్చిమ యూపీ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని మాయావతి హామీ ఇచ్చారు. బీఎస్పీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు, కార్మికులు, రైతుల అవసరాలను గుర్తించి సేవలు అందించడంతో పాటు ప్రాంత అభివృద్ధికి చొరవ చూపుతుందని వెల్లడించారు. పశ్చిమ యూపీలో కీలక సామజిక వర్గాలైన జాట్, ముస్లిం వర్గాల మద్దతు పొందడానికి మాయావతి ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగానే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారు. 2013లో సమాజ్ వాదీ పార్టీ హయాంలో ముజఫర్ నగర్‌లో జరిగిన మతపరమైన అల్లర్లు జాట్, ముస్లిం వర్గాల మధ్య స్నేహాన్ని దెబ్బతీశాయి.
మాయావతి తన ప్రసంగంలో ప్రధానంగా బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో గణనీయమైన స్థానాల్లో గెలుపొందాలని బీఎస్పీ ప్రణాళికలు రచిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 14 , 2024 | 09:42 PM