అమెరికా అదానీని క్రిమినల్ అన్నా మోదీ ఆయన్నే సమర్థిస్తున్నారు
ABN, Publish Date - Dec 01 , 2024 | 02:29 AM
దేశంలో విద్వేషాలు, విభజనకు బీజేపీ ఆజ్యం పోస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు.
విద్వేషం, విభజనకు బీజేపీ ఆజ్యం: రాహుల్
వయనాడ్, నవంబరు 30: దేశంలో విద్వేషాలు, విభజనకు బీజేపీ ఆజ్యం పోస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. పారిశ్రామికవేత్త అదానీకి ప్రధాని మోదీ అండగా ఉన్నారని ధ్వజమెత్తారు. ఇటీవల లోక్‌సభకు ఎన్నికైన వయనాడ్ ఎంపీ, తన చెల్లెలు ప్రియాంకతో కలిసి శనివారం వయనాడ్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. ‘లోక్‌సభలో ఓ రాజకీయ సిద్ధాంతంపై మేం పోరాడుతున్నాం. బీజేపీ మాత్రం విద్వేషం, విభజన, కోపం, హింసల గురించి మాట్లాడుతోంది. రాజ్యాంగం ప్రజలందరినీ సమానంగా చూడాలని చెబుతోంది. మోదీ మాత్రం అదానీని ప్రత్యేకంగా చూస్తున్నారు. అదానీని అమెరికా క్రిమినల్ అని అన్నా, ముడుపుల కేసులో ఆయనపై అభియోగాలు మోపినా లెక్కచేయనని.. ఇక్కడ మాత్రం అభియోగాలు మోపబోమని ప్రధాని చెబుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల హృదయాల్లో ఉన్న భావనే ప్రియాంకను ఎంపీ స్థాయికి తీసుకొచ్చిందన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 02:30 AM