Rahul Gandhi: కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి ఘటనపై రాహుల్ తొలి స్పందనిదే..
ABN, Publish Date - Aug 14 , 2024 | 05:31 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారంనాడు తొలిసారి స్పందించారు. ఈ ఘటనతో వైద్య వృత్తిలో ఉన్నవారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారంనాడు తొలిసారి స్పందించారు. ఈ ఘటనతో వైద్య వృత్తిలో ఉన్నవారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మహిళల్లో అభద్రతా భావం పెరుగుతోందని అన్నారు. ట్రెయినీ వైద్యురాలి అత్యాచారం కేసుపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, విద్యా, వైద్య సంస్థల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలు ప్రశ్నార్ధకమవుతున్నాయని అన్నారు.
Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు
''కోల్‌కతాలో ఓ జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన యావద్దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ అత్యంత కిరాతక, అమానవీయ చర్య వెనుక వాస్తవాలు వెలికి రావాలి. డాక్టర్స్ కమ్యూనిటీలోనూ, మహిళలల్లోనూ ఒకరకమైన అభద్రతా వాతావరణం నెలకొంది'' అని రాహుల్ విమర్శించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని, ఆసుపత్రులు, స్థానిక యంత్రాగంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. మెడికల్ కాలేజీలు వంటి ప్రాంతాల్లోనే వైద్యులకు రక్షణ లేకపోతే బయట చదువుల కోసం తమ ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎలా పంపుతారని ఆయన ప్రశ్నించారు. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఇలాంటి ఘోరమైన నేరాలను అరికట్టడంలో విఫలమవుతుండటం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. మహిళలపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలను నివారించేందుకు దేశవ్యాప్త చర్చ, సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. హత్రాస్ నుంచి ఉన్నావో వరకూ, కథువా నుంచి కోల్‌కతా వరకూ మహిళలపై దాడుల ఘటనలు పెరుగుతూ పోతుండటంపై అన్ని రాజకీయ పార్టీలు, సమాజంలోని ప్రతి వర్గం సీరియస్‌గా చర్చించి, సమగ్ర చర్యలు తీసుకోవాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 14 , 2024 | 05:31 PM