Rahul Gandhi: మతాల మధ్య మోదీ గోడలు
ABN, Publish Date - Nov 09 , 2024 | 05:49 AM
దేశంలో ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చాలని మోదీ ప్రయత్నిసున్నారని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మణిపూర్ తగలబడటానికి అదే కారణమని ఆరోపించారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లోహర్‌గడా, సిండెగాలలో చేపట్టిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మత ప్రాతిపదికన దేశాన్ని చీల్చే కుట్ర
మణిపూరే అందుకు నిదర్శనం: రాహుల్
లొహర్‌డగా, సిండెగా, నవంబరు 8: దేశంలో ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చాలని మోదీ ప్రయత్నిసున్నారని రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మణిపూర్ తగలబడటానికి అదే కారణమని ఆరోపించారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం లోహర్‌గడా, సిండెగాలలో చేపట్టిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ వైఖరి వల్ల దేశంలో 90శాతం ప్రజలు వారి హక్కుల్ని, ప్రయోజనాలని కోల్పోయారని విమర్శించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కుల మధ్య బీజేపీ వైరం సృష్టించాలనుకుంటోందని ఆరోపించారు. ‘‘దేశాన్ని ఒక్కటి చేయడం కోసమే నేను 4వేల కి.మీల పాదయాత్ర చేశాను. 90శాతం జనాభా కలిగిన ఆదివాసీలు, దళితులు, ఓబీసీల కోసం గొంత్తెతాను. కానీ నేను దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నానని బీజేపీ విమర్శిస్తోంది.
వెనుకబడిన వర్గాల హక్కుల పోరాడటం తప్పే అయితే ఆ తప్పునే నేను కొనసాగిస్తా’’నని చెప్పారు. బీజేపీ... నీటిని, భూమిని, అడవిని(జల్, జంగల్, జమీన్) ఆదివాసీల నుంచి దూరం చేయాలని చూస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలనకుంటున్న ఎన్డీఏ కూటమికి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకుంటున్న ఇండియా కూటమికి మధ్యనే ఎన్నికల్లో పోటీ అని పిలుపునిచ్చారు. బలహీనవర్గాల ప్రజల పరిస్థితి మెరుగుపడటం కోసం, దేశాభివృద్ధి కోసం కులగణన అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కాగా, నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశంలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలతో పాటు అసంఘటిత రంగం కుదేలైందని తద్వారా గుత్తాధిపత్యానికి దారి తీసిందని రాహుల్ విమర్శించారు. నోట్ల రద్దు చేసిన శుక్రవారానికి 8 ఏళ్లు పూర్తైంది.
Updated Date - Nov 09 , 2024 | 05:49 AM