Rahul Gandhi: బీజేపీ ఎంపీల వ్యాఖ్యలను తొలగించండి
ABN, Publish Date - Dec 12 , 2024 | 05:21 AM
కాంగ్రెస్- సోరోస్ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌ను కోరారు.
సభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్‌సభ స్పీకర్‌కు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబరు 11: కాంగ్రెస్- సోరోస్ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను బుధవారం స్వయంగా కలిసిన రాహుల్ గాంధీ.. సభ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీకి హంగేరికి చెందిన బిలియనీర్ జార్జి సోరో్‌సకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, సంబిత్ పాత్రా డిసెంబరు 5న ఆరోపించారు. ఆ మరుసటి రోజున నిషికాంత్ దూబే లోక్‌సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హస్తం సోరోస్ చేతిలో ఉందని, అమెరికా ప్రభుత్వం, జార్జి సోరోస్ ఇచ్చే నిధులతో పని చేసే ఓసీసీఆర్‌పీ(ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు)తో కాంగ్రె్‌సకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ గాంధీ.. సోరోస్ దగ్గర డబ్బు తీసుకున్నారా ? అని ప్రశ్నించారు. తీవ్ర దుమారం రేపిన ఈ వ్యాఖ్యలనే రికార్డుల నుంచి తొలగించాలని రాహుల్ కోరారు. అయితే, తాను చేసిన విజ్ఞప్తికి సభాపతి సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని స్పీకర్‌తో భేటీ అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. అదానీ అంశంపై చర్చ జరగకూడదనే లక్ష్యంతో బీజేపీ ఎంపీలు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
రాజ్‌నాథ్‌కు గులాబీ
ఓవైపు అదానీ, మోదీ చిత్రాలు.. మరోవైపు ‘అదానీ-మోదీ భాయ్ భాయ్’ అనే మాటలు ముద్రించి ఉన్న సంచులతో మంగళవారం పార్లమెంట్ వద్ద నిరసన తెలియజేసిన ఇండియా కూటమి ఎంపీలు బుధవారం మరింత వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. పార్లమెంట్ భవనం ప్రవేశ ద్వారం వద్ద బీజేపీ ఎంపీలకు జాతీయ జెండా(త్రివర్ణ పతాకం ముద్రించిన కార్డులు), చిన్న గులాబీ పువ్వు ఇచ్చి స్వాగతిస్తూ సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఇదే క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు రాహుల్ గాంధీ జాతీయ జెండా, గులాబీ పువ్వు అందజేశారు. కానీ, రాజ్‌నాథ్ వాటిని స్వీకరించకుండానే ముందుకు వెళ్లిపోయారు. కాగా, ఎంతో మంది సామాన్యులకు జీవనాడి లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎ్‌సబీ)లను మోదీ ప్రభుత్వం.. కొన్ని ధనిక, శక్తిమంతమైన సంస్థలకు ప్రైవేటు పెట్టుబడి సంస్థలుగా మార్చేసిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. బుధవారం అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమాఖ్యకు చెందిన ప్రతినిధులతో రాహుల్ సమావేశమయ్యారు. అనంతరం ‘ఎక్స్’లో ఈ మేరకు పోస్టు చేశారు. తన మోసపూరిత స్నేహితుల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులను అపరిమిత నిధుల వనరుగా చూడటాన్ని మోదీ ప్రభుత్వం ఇకనైనా నిలివేయాలని అన్నారు.
నెహ్రూ-గాంధీ కుటుంబం, సోరో్‌సది ఎన్నో ఏళ్ల బంధం
కాంగ్రెస్- సోరోస్ అంశంలో బీజేపీ తన దాడిని తీవ్రం చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం, జార్జి సోరోస్ మధ్య బంధం ఈనాటి కాదని, ఎన్నో ఏళ్ల అనుబంధమని పేర్కొంటూ బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. జార్జి సోరోస్ మాదిరిగానే హంగేరికి చెందిన ఫోరీ నెహ్రూ.. జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన బీకే నెహ్రూను వివాహం చేసుకున్నారని, తద్వారా ఫోరీ నెహ్రూకు రాహుల్ గాంధీతో చుట్టరికం ఉందని బీజేపీ పేర్కొంది. బీకే నెహ్రూ అమెరికాలో భారత రాయబారిగా పని చేసిన రోజుల్లో జార్జి సోరోస్ పలుమార్లు ఫోరీ నెహ్రూను కలిశారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. ఈ నేపథ్యం నెహ్రూ-గాంధీ కుటుంబం తమ ఆర్థిక ప్రగతి కోసం దేశ ప్రయోజనాల విషయంలో ఎంత మేరకు రాజీపడిందనే ప్రశ్నలు లేవనెత్తుతుందని బీజేపీ పేర్కొంది.
Updated Date - Dec 12 , 2024 | 05:21 AM