Railway Budget : రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:42 AM
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం ఒక్కసారి మాత్రమే రైల్వే అనే మాటను పలికారు. కీలక ప్రకటనలు లేవు. కొత్త రైళ్ల ఊసు
కవచ్ ఏర్పాటుకు ప్రాధాన్యం
న్యూఢిల్లీ, జూలై 23: కేంద్ర బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో కేవలం ఒక్కసారి మాత్రమే రైల్వే అనే మాటను పలికారు. కీలక ప్రకటనలు లేవు. కొత్త రైళ్ల ఊసు లేదు. తర్వాత ఈ కేటాయింపులపై రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ విలేకరులతో మాట్లాడారు. రూ.1.09 లక్షల కోట్లను భద్రతా చర్యల కోసం వెచ్చిస్తామని చెప్పారు. వీటిలో రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్’ వ్యవస్థ ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. పాత ట్రాక్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగు, ఫ్లై ఓవర్లు, అండర్‌పా్‌సల నిర్మాణం చేపడతామన్నారు. 2014కు ముందు రైల్వేకు కేటాయింపులు రూ.35 వేల కోట్లు మాత్రమేనని, మోదీ హయాంలో అది రూ.2.62 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. మొత్తం 12,500 జనరల్ కోచ్‌లను తయారుచేస్తామని, వీటికి బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని ఆయన చెప్పారు.
కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి నిరాశ!
హైదరాబాద్, జూలై 23(ఆంధ్రజ్యోతి): కాజీపేటలో ప్రతిపాదించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిరాశే ఎదురైంది. కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును ప్రస్తావించకపోవడం తెలంగాణ ప్రజలను నిరాశపరిచింది. రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. రూ.770 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన భద్రాచలం రోడ్-డోర్నకల్ మధ్య 54.65 కి.మీ డబ్లింగ్ పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. కాజీపేట -విజయవాడ మూడో లైన్‌కు రూ.310 కోట్లు, కాజీపేట-బల్లార్షా మూడో లైన్‌కు 300 కోట్లు, బీబీ నగర్-గుంటూరు-ముద్ఖేడ్ డబ్లింగ్ పనులకు రూ.220 కోట్లు, బీబీ నగర్-గుంటూరు డబ్లింగ్ పనులకు 200 కోట్లు కేటాయించారు.
Updated Date - Jul 24 , 2024 | 05:42 AM