Ram Mandir: అయోధ్య రాములోరి భద్రతకు ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్
ABN, Publish Date - Jan 29 , 2024 | 09:16 AM
అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు.
అయోధ్య: అయోధ్య ఆలయంలో బాల రాముడికి (Ram Lalla) నిత్య పూజలు జరుగుతున్నాయి. శ్రీ రాముడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అయోధ్య రామ మందిరం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇటీవల బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారు. సీఆర్పీఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీజీ) దళాలు కూడా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ఆ సమయంలో ఏజెన్సీల నుంచి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉపయోగించారు. సొంతంగా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని ఉత్తర ప్రదేశ్ పోలీసులు భావించారు. ఇజ్రాయెల్ నుంచి 10 యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలు చేశారు. త్వరలో వాటి సేవలను ఉపయోగిస్తామని చెబుతున్నారు.
ఇజ్రాయెల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సామర్థ్యాన్ని తొలుత ఉత్తరప్రదేశ్ పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాంటీ డ్రోన్ వ్యవస్థ 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తిస్తాయి. ఆ పరిధిలో శత్రువుకు చెందిన డ్రోన్లను నిర్వీర్యం చేస్తాయని వివరించారు. యాంటీ డ్రోన్ల ద్వారా ప్రమాదాన్ని గుర్తించి, వేగంగా నిర్ణయం తీసుకునేందుకు పోలీసులకు అవకాశం ఉంటుంది. శత్రువుకు చెందిన డ్రోన్లను హ్యాక్ చేసే వీలు కూడా ఉంటుంది.
10 యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను ఉత్తరప్రదేశ్ పోలీసులు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో సున్నిత ప్రాంతాలు అయిన లక్నో, వారణాసి, మథురలో యాంటీ డ్రోన్లను ఇన్ స్టాల్ చేస్తున్నామని వివరించారు. అవసరాన్ని బట్టి మిగిలిన చోట్ల నెలకొల్పుతామని స్పష్టంచేశారు. త్వరలో డివైజ్ తమ చేతికి వస్తుందని ఓ పోలీస్ అధికారి వివరించారు. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ యూపీ పోలీసులను బలోపేతం చేయడమే కాక నిఘాను మరింత కఠినతరం చేసే వీలు ఉంటుందని ఓ పోలీస్ అధికారి వివరించారు.
Updated Date - Jan 29 , 2024 | 09:16 AM