Ram Mandir: 22న కొన్ని రాష్ట్రాల్లో సెలవు, మరికొన్ని రాష్ట్రాల్లో హాఫ్ డే, ఏయే రాష్ట్రాలు అంటే..!
ABN, Publish Date - Jan 20 , 2024 | 12:56 PM
అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్నామని సిబ్బంది, శిక్షణ విభాగం ప్రకటనలో తెలిపింది. ఆ రోజున కొన్ని రాష్ట్రాలు పూర్తిగా సెలవు ఇవ్వగా మరికొన్ని రాష్ట్రాలు హాఫ్ డే సెలవు ప్రకటించాయి.
అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయంలో స్థానిక ఆలయాల్లో భారీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ భక్తులు రాములోరి రూపాన్ని చూసి తరించనున్నారు. జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కార్యాలయాలు మూసి ఉంటాయి. ఆ రోజున కొన్ని రాష్ట్రాలు పూర్తిగా సెలవు ఇవ్వగా మరికొన్ని హాఫ్ డే సెలవు ప్రకటించాయి.
త్రిపుర: త్రిపురలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.
ఛత్తీస్ గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవు. ఇక్కడ హాఫ్ డే సెలవు ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్: రాములోరి ప్రాణ ప్రతిష్ఠ జరిగే అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ 22వ తేదీన అన్ని సంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేస్తారు.
మధ్యప్రదేశ్: పాఠశాలలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సెలవు ఇచ్చింది. పిల్లలు అందరూ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠను పండగలా జరుపుకోవాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కోరారు. ఆ రోజున షాపులు, మద్యం షాపులు పూర్తిగా మూసి వేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులకు హాఫ్ డే సెలవు ఇచ్చారు.
గోవా: గోవా ప్రభుత్వం 22వ తేదీన స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చింది.
హర్యానా: హర్యానా ప్రభుత్వం సోమవారం స్కూళ్లకు సెలవు ఇచ్చింది. ఆ రోజు రాష్ట్రంలో మద్యం సేవించేందుకు అనుమతి లేదు.
ఒడిశా: ప్రభుత్వ కార్యాలయాలకు ఒడిశా ప్రభుత్వ అధికారులు హాఫ్ డే సెలవు ఇచ్చారు.
అసోం: అసోంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు హాఫ్ డే సెలవు ఉంటుంది.
రాజస్థాన్: రాజస్థాన్ ప్రభుత్వం హాఫ్ డే సెలవు ఇచ్చింది.
గుజరాత్: గుజరాత్ ప్రభుత్వం అన్ని కార్యాలయాలు, స్కూళ్లకు హాఫ్ డే సెలవు ఇచ్చింది.
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో మధ్యాహ్నాం 2.30 గంటల వరకు అన్ని కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. విద్యాసంస్థలకు మాత్రం సెలవు మంజూరు చేశారు.
మహారాష్ట్ర: సోమవారం రోజును పబ్లిక్ హాలీడేగా మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఆ రోజున స్టాక్ మార్కెట్లకు సెలవు ఇచ్చారు. ఆ రోజుకు బదులు శనివారం ట్రేడింగ్ నిర్వహిస్తారు.
పుదుచ్చేరి: పుదుచ్చేరి ప్రభుత్వ అధికారులు సోమవారం రోజును సెలవుగా ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 20 , 2024 | 12:56 PM