Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
ABN, Publish Date - Jul 24 , 2024 | 07:20 AM
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడెన్‌గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడెన్‌గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆస్పత్రిలో ఉన్నారు. ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో సోమవారమే ఆయన బీహార్ రాజధాని పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లారు. కాగా దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు..
లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2022లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. లాలూ కిడ్నీలు 25 శాతం మాత్రమే పనిచేయడంతో మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. దీంతో సింగపూర్‌లో నివసిస్తున్న లాలూ కుమార్తె రాహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి దానం చేశారు. డిసెంబర్ 5, 2022 న ఈ చికిత్స జరగగా ఆయన కోలుకొని తిరిగి భారత్ వచ్చారు. రాహిణి ఆచార్య సింగపూర్‌లో నివసిస్తున్నారు.
ఇక 2022లో ఒకసారి తన ఇంటిలోనే జారిపడ్డారు. పలు చోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి. వెంటనే ఆయనను పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత పాట్నా నుంచి విమానంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి అక్కడ చికిత్స అందించిన విషయం తెలిసిందే.
Updated Date - Jul 24 , 2024 | 07:20 AM