Mohan Bhagwat : కనీసం ముగ్గురిని కనండి
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:57 AM
ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పిలుపిచ్చారు.
జనాభా క్షీణిస్తే సమాజమే అంతరిస్తుంది!
భాషలు, సంస్కృతి కూడా కనుమరుగవుతాయి
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు
నాగపూర్, డిసెంబరు 1: ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎ్‌సఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పిలుపిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు. ఆయన ఆదివారమిక్కడ నాగపూర్‌లో నిర్వహించిన ‘కథాలే కుల్ సమ్మేళన్’లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుత జనాభా విధానం పాతికేళ్లనాటిదని.. 1998లో లేదా 2002లో ఖరారు చేశారని.. జన సంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తుచేశారు. ‘కుటుంబం సమాజంలో భాగం. ప్రతి కుటుంబం ఓ యూనిట్. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే. సమాజం అంతరించిపోతుంది. ఆ పరిస్థితుల్లో దానినెవరూ నాశనం చేయనక్కర్లేదు. తనంత తానే నాశనమవుతుంది. భాషలూ కనుమరుగవుతాయి. సంస్కృతీ నశిస్తుంది. ప్రతి జంటా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను.. కనీసం ముగ్గురిని కనాలి.
ఈ విషయాన్ని జనసంఖ్య శాస్త్రమే చెబుతోంది. సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యం’ అని భాగవత్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణ, మతపరమైన జనాభా.. ఈ రెండు అంశాలూ విస్మరించడానికి వీల్లేనివని చెప్పారు. గతంలో నాగపూర్‌లోనే జరిగిన దసరా ర్యాలీలో కూడా ఆయన జనాభా పెరుగుదల అవసరాన్ని నొక్కిచెప్పారు. ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానాన్ని రూపొందించాలని ఆ సందర్భంగా అన్నారు. వివిధ వర్గాల జనాభాలో అసమతుల్యం.. భౌగోళిక సరిహద్దులనూ ప్రభావితం చేస్తుందని తెలిపారు. ‘జనాభా అత్యధికంగా ఉంటే భారం ఎక్కువగా ఉంటుందన్నది నిజమే. కానీ జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుంది. 50 ఏళ్ల తర్వాత మన దేశం ఎంత మందికి ఆహారం అందించగలుగుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని భాగవత్ అభిప్రాయపడ్డారు. మహిళను తల్లిగా పరిగణించడం మంచిదేనని.. అయితే వారిని ఇళ్లలో నాలుగు గోడలకే పరిమితం చేయడం మంచిది కాదని చెప్పారు.
మోదీపై ఒవైసీ ఫైర్
భాగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని ఆయన గతంలో అన్నారు. కాంగ్రెస్ అఽధికారంలోకి వస్తే తల్లులు, కుమార్తెల నుంచి బంగారం, మంగళసూత్రాలు లాక్కుని ముస్లింలకు పంచుతారని ప్రచారం చేశారు. ఇప్పుడు భాగవత్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటున్నారు. ఇక ఆర్‌ఎ్‌సఎ్‌సవాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టండి’ అని అన్నారు.
ప్రపంచ జనాభా తగ్గుముఖం..
1960-2000 మధ్య ప్రపంచ జనాభా రెట్టింపైంది. ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ వస్తోందని పలు అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. జనాభా భర్తీ రేటు 2.1కి సమీపంలో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీసియా.. 2.1 కంటే తక్కువ రేటు ఉన్న దేశాల్లో అమెరికా, మెక్సికో, బ్రెజిల్ ఉన్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో ఇంకా బాగా తక్కువగా ఉండడమే గాక వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. భారత్‌లోని పలు రాష్ట్రాలకు కూడా ఆ ముప్పు పొంచి ఉండడంతో.. పిల్లలను ఎక్కువగా కనాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల పదే పదే చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో జనాభా నియంత్రణకు గట్టి పట్టు పట్టిన ఆయన.. ఇప్పుడు సమీప భవిష్యత్‌లో యువజనుల సంఖ్య తగ్గే ప్రమాదం కనబడుతుండడంతో ఆంధ్ర ప్రజలు ఎక్కువ సంతానాన్ని కనాలని కోరుతున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 03:57 AM