Sambhal Violence: మసీదు సర్వే నేపథ్యంలో ఘర్షణ.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్
ABN, Publish Date - Nov 25 , 2024 | 07:57 AM
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మొఘల్ కాలం నాటి రాజ జామా మసీదు రీ సర్వేను స్థానిక ముస్లింలు వ్యతిరేకించారు. దీంతో పోలీసులు, స్థానిక ముస్లింలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకోవడంతో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు.
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) సంభాల్ జిల్లాలో మొఘల్ కాలం నాటి జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ ముస్లింలు ఆదివారం పోలీసులతో హింసాత్మకంగా ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మంది భద్రతా సిబ్బంది సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానికంగా ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. దీంతోపాటు 12వ తరగతి వరకు స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు మసీదును సర్వే చేయడంతో సంభాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మసీదు స్థానంలో హరిహర దేవాలయం ఉందని పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సర్వే చేపట్టారు.
హింసపై దర్యాప్తు
ఈ నేపథ్యంలో ఆదివారం ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు, పోలీసులపై రాళ్లు రువ్వారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, లాఠీలను ప్రయోగించారు. ఇద్దరు మహిళలు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హింసపై దర్యాప్తు ప్రారంభించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కొన్ని ద్విచక్రవాహనాలకు కూడా కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారు. ముఖ్యంగా దీపా సరాయ్ ప్రాంతంలో బుల్లెట్లు పేలిన అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేశారు. హింసకు పాల్పడిన దుండగులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఆదేశాల మేరకు
ఆదివారం ఉదయం షాహి జామా మసీదు వద్ద సర్వే బృందం పని ప్రారంభిస్తుండగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో హింస మొదలైంది. అక్కడే నినాదాలు చేయడం ప్రారంభించారు. సాధారణంగా మసీదులో ప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉదయం సర్వే నిర్వహించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ రెండో సర్వే ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అదే సమయంలో అక్కడ జనం స్థానిక ముస్లింలు గుమిగూడి ఆందోళనకు దిగారు.
అడ్డుకునే ప్రయత్నం
కోర్టు ఆదేశాల మేరకు నవంబర్ 24న ఉదయం అడ్వకేట్ కమీషనర్ రమేష్ రాఘవ్ మళ్లీ రెండోసారి సర్వే చేయడానికి జామా మసీదుకు చేరుకున్నప్పుడు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముస్లింలు నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు పెద్దఎత్తున నినాదాలు చేసిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది క్రమంగా ఘర్షణకు దారితీసింది.
మహిళలతో సహా
ఓ గుంపు సర్వే బృందాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వడం ప్రారంభించింది. జనాన్ని నియంత్రించేందుకు తొలుత తేలికపాటి బలగాలు ప్రయోగించామని, ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు మహిళలతో సహా పెద్ద సంఖ్యలో వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘర్షణలో సర్కిల్ అధికారితో సహా 20 నుంచి 22 మంది పోలీసులు గాయపడినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి:
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 25 , 2024 | 07:59 AM