CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Oct 21 , 2024 | 01:44 PM
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఢిల్లీ: దేశ చరిత్రలో ఒక వివాదం శతాబ్దానికిపైగా నానుతూ వచ్చింది. చివరకు దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పుతో సద్దుమణిగింది. అదే అయోధ్య రామజన్మ భూమిపై వివాదం. తీవ్ర ఉద్రిక్తతను రాజేసిన ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Justice Dhananjaya Y Chandrachud) 2019లో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలో వివాదంలో ఉన్న భూమి రాములవారికి చెందిందేనని అయిదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం రాముల వారి గుడి నిర్మాణానికి సిద్ధం కావడం, ఆలయ నిర్మాణం పూర్తి కావడం అన్ని చకచకా జరిగిపోయాయి.
ఈ ఏడాది జనవరిలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహసంగా జరిగింది. అయితే కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ తొలిసారిగా ఈ అంశంపై మాట్లాడారు. వివాదాలు అలుముకున్న ఈ కేసును డీల్ చేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
తన స్వగ్రామమైన మహారాష్ట్రలోని కన్హెర్సర్‌ను జస్టిస్ చంద్రచూడ్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు సన్మాన సభ ఏర్పాటుచేశారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. తరుచూ కేసులు వస్తుంటాయని, కానీ కొన్ని పరిష్కారం చూపలేనంత క్లిష్టంగా ఉంటాయన్నారు. అయోధ్య విషయంలోనూ అదే జరిగిందని తెలిపారు.
‘మా వద్దకు తరచూ చాలా కేసులు వస్తుంటాయి. కానీ మేం కొన్నింటికి ఒక్క పరిష్కారంతో రాలేం. అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసు విచారణ సమయంలో మూడు నెలల పాటు మాకు అలాగే జరిగింది. నేను భగవంతుడి ఎదుట నిలబడి పరిష్కారం చూపమని వేడుకున్నా’ అని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. తాను రోజూ దేవుడ్ని పూజిస్తానని ఆయన అన్నారు. భగవంతుడిపై నమ్మకం ఉంటే తప్పకుండా సమస్యకు పరిష్కారం చూపుతాడని తెలిపారు.
కేసు పూర్వాపరాలివే..
రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2019 నవంబరు 9న తీర్పు వెలువరించింది. దాదాపు 135 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతుండగా.. సుప్రీం తీర్పు చారిత్రకంగా నిలిచింది. హిందూ, ముస్లింలకు మధ్య వివాదాస్పదంగా ఉన్న రెండున్నర ఎకరాల స్థలాన్ని హిందూ పక్షాలకు ధర్మాసనం అప్పగించింది.
మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్య రామజన్మ భూమిలో జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది జులైలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ రామ్ లల్లా ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు జరిపారు. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. 135 ఏళ్ల వివాదాన్ని పరిష్కరించిన సందర్భంగా తాను ఎదుర్కొన్న అనుభవాలను సీజేఐ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
Police Commemoration Day 2024: సలాం పోలీసన్నా.. నీ సేవలు వెలకట్టలేనివి
For Latest News and National News click here
Updated Date - Oct 21 , 2024 | 01:44 PM