Bomb threats: దేశంలోని పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
ABN, Publish Date - Jun 18 , 2024 | 07:34 PM
దేశంలోని పలు విమానాశ్రయాలకు మంగళవారంనాడు బాంబు ఈ-మెయిల్స్ రావడం కలకలం సృష్టించింది. పాట్నా, కోయంబత్తూరు, జైపూర్, వడోదరా సహా పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో అన్నిచోట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పాటు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: దేశంలోని పలు విమానాశ్రయాలకు (Airports) మంగళవారంనాడు బాంబు ఈ-మెయిల్స్ (Bomb threat Emails) రావడం కలకలం సృష్టించింది. పాట్నా, కోయంబత్తూరు, జైపూర్, వడోదరా సహా పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో అన్నిచోట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పాటు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మధ్యాహ్నం 12.40 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి ఒకరు దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్టు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానం బాంబు బెదిరింపు ఈమెయిల్ కారణంగా ఆలస్యంగా బయలుదేరింది. ఎయిర్ పోర్ట్ అథారిటికీ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో ఈ జాప్యం చోటుచేసుకుంది. ఇదే తరహాలో చెన్నై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో దుబాయ్ వెళ్లే ఎమిరేట్స్ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరింది.
కోయంబత్తూరు ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరింపు ఇ-మెయిల్ చేయడంతో సీఐఎస్ఎఫ్ అప్రమత్తమై బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపింది. విమనాశ్రయం యావత్తు గాలించిన తర్వాత అనుమానాస్పద వస్తువేదీ కనిపించకపోవడంతో ఇది ఉత్తుత్తి బెదిరింపేనని తేలింది. అయితే, బాంబు బెదరింపుల కారణంగా విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ ఎస్.సెంథిల్ వాలవన్ తెలిపారు.
పాట్నా విమానాశ్రయానికి సైతం బెదిరింపులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. జైపూర్ విమానాశ్రయానికి ఇదే తరహా పరిస్థితి ఎదురైందని, భద్రతా ఏజెన్సీలు వెంటనే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారని, అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. బాంబు బెదిరింపుల కారణంగా వడోదర ఎయిర్‌పోర్ట్‌లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సైతం..
మరోవైపు, హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది క్షుణంగా తనిఖీలు చేస్తు్న్నారు.
Updated Date - Jun 18 , 2024 | 07:35 PM