Shashi Tharoor: షేక్ హసీనా భారత్‌లో ఉండడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Aug 12 , 2024 | 11:08 AM
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతుండడంపై కాంగ్రెస్ సీనియర్, ఎంపీ శశిథరూర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. ‘‘ మనం షేక్ హసీనాకు సాయం చేయకపోతే అది భారతదేశానికే అవమానం అయ్యేది. స్నేహితుడితో మనం చెడుగా ప్రవర్తిస్తే ఎవరూ మనకు మిత్రులు కావాలని కోరుకోరు. షేక్ హసీనా భారతదేశానికి స్నేహితురాలు. భారత్ ఆమెకు సన్నిహితురాలు. స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే సాయం చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించకూడదు. భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను. ఆమెకు భద్రత కల్పించి ఇక్కడికి తీసుకురావడానికి, ఇచ్చాక భద్రత కల్పిస్తూ భారత్ సరైన పని చేసింది’’ అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఇక పొరుగు దేశంలో అధికార మార్పిడి భారత్‌కు ఏమాత్రం ఆందోళన కలిగించబోదని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని పరిణామాలు భారత్‌తో ఆ దేశ సంబంధాలను ఏవిధంగా ప్రభావితం చేస్తాయని ప్రశ్నించగా.. బంగ్లాదేశ్‌తో భారత్‌కు సహజ సిద్దమైన స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు. బంగ్లాదేశ్ ప్రజల శ్రేయస్సు భారత్ తొలి లక్ష్యం అని అన్నారు. ప్రాధాన్యత పరంగా చూస్తే దేశం రెండవ స్థానంలో, ఏ రాజకీయ వ్యక్తి అయినా మూడవ స్థానంలో ఉంటారని చెప్పారు. ‘‘మనం ఎలప్పుడూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉన్నాం. 1971 యుద్ధం సమయంలో వారితోనే ఉన్నాం. బంగ్లాదేశ్ ప్రజలు కష్ట, సుఖాల్లోనూ వారి వెంటే ఉన్నాం. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా భారత్‌తో స్నేహపూర్వకంగానే ఉన్నారు. భారత్ కూడా ఆ సంబంధాన్ని మరింతగా దృఢంగా కొనసాగించింది. రాబోయే కాలంలో ఇరు దేశాల మధ్య బంధంలో ఎలాంటి తగ్గుదల ఉండకూదు’’ అని శిశిథరూర్ అభిలాషించారు.
ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం విషయంలో భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శశిథరూర్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా మహమ్మద్ యూనస్ తనకు తెలుసునని, అతను అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని మెచ్చుకున్నారు. జమాతే ఇస్లామీ లేదా పాకిస్తానీ ఐఎస్‌ఐ కంటే.. అమెరికాకే ఎక్కువ దగ్గరగా ఉన్నారని భావిస్తున్నట్టు చెప్పారు. ఇక బంగ్లాదేశ్‌లో బలమైన ఉనికి ఉన్న చైనీయులు ఈ పరిణామంతో మరింత విస్తరించడానికి ఒక అవకాశంగా భావించవచ్చునని విశ్లేషించారు. ఇక మధ్యంతర ప్రభుత్వ కూర్పు ఎలాంటి ఆందోళనలు లేవని అన్నారు. దేశం శాంతి, మైనారిటీల రక్షణ కోసం తాత్కాలిక ప్రభుత్వ అధినేత చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
Updated Date - Aug 12 , 2024 | 11:08 AM